వంట.. కట్టెలతో తంటా!

25 Oct, 2016 00:18 IST|Sakshi
వంట.. కట్టెలతో తంటా!

మొయినాబాద్ రూరల్:  ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం కట్టెలతో వంట చేయడం నిర్వాహకులకు కష్టంగా మారింది. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకపోవటంతో ఇప్పటికీ పాఠశాలల్లో కట్టెల పొయిల పైనే  ఆధార పడుతున్నారు. మొయినాబాద్ మండలంలో 32 ప్రాథమిక పాఠశాలలు, 5 ప్రాథమికోన్నత, 14 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదులకు పక్కనే వంట గదులు ఉంటున్నాయి.

 కట్టెల పొయితో వంట చేస్తుండడంతో తరగతి గదుల్లోకి పొగ వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వంట చేసే వారు కూడా పొగతో అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో వంట గదులు సరిగా లేకపోవడంతో ఆరు బయటే వండుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో వంట చేయడం ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. వంట చెరుకును పాఠశాల గదుల్లో నిల్వ చేస్తున్నారు. ‘దీపం’ తరహాలో సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు.
 
 పొగతో ఇక్కట్లు
 మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు వంట చాలా కష్టంగా ఉంటోంది. పాఠశాలలకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తే బాగుంటుంది. గతంలో అజీజ్‌నగర్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్  మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకూ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా గ్యాస్ సరఫరాకు చర్యలు చేపట్టాలి. - ప్రవీణ్, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అద్యక్షుడు
 

మరిన్ని వార్తలు