-

మాడిన మధ్యా‘అన్నం’

29 Jul, 2016 12:43 IST|Sakshi
మాడిన మధ్యా‘అన్నం’

♦ సరిపడా భోజనం పెట్టని నిర్వాహకులు
♦ కడుపు మాడ్చుకుంటున్న చిన్నారులు
♦ పట్టించుకోని అధికారులు

జ్యోతినగర్‌ : ఈ ఫొటోల్లో భోజనం చేస్తున్న విద్యార్థులంతా రామగుండం కార్పొరేషన్‌ మూడో డివిజన్‌ పరిధిలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టకపోవడంతో కడుపుమాడ్చుకుంటున్నారు. కొందరు ఆకలి తట్టుకోలేక ఇలా మాడిపోయిన అన్నం తింటున్నారు. ఇలా చాలారోజులుగా జరుగుతున్నా అధికారులు గానీ, ఉపాధ్యాయులగానీ పట్టించుకోవడంలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. గురువారం మధ్యాహ్నం ‘సాక్షి’ పాఠశాలకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది.

20 మంది విద్యార్థులు మొదట పెట్టిన అన్నం చాలక మళ్లీ ప్లేట్లు పట్టుకుని దీనంగా నిల్చున్నారు. నిర్వాహకులు వారిలో కొందరికి మాడిపోయిన అన్నం వడ్డించారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ను వివరణ కోరగా .. ‘ఈరోజే సరిపోలేదు. రోజు సరిపడా అన్నం పెడుతున్నాం’ అని చెప్పారు. విద్యార్థులు మాత్రం తాము రోజూ సగం కడుపుకే భోజనం చేస్తున్నామని చెప్పారు. మండల విద్యాధికారి నివాసముంటున్న ఈ ప్రాంతంలోనే మధ్యాహ్న భోజనం పరిస్థితి ఇలా ఉంటే ఇక మండలంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు