పాల..వెలవెల

9 Sep, 2016 00:10 IST|Sakshi
ఖమ్మంలోని విజయ డెయిరీ ప్లాంట్‌
  • ప్రభుత్వ డెయిరీకి గడ్డుకాలం 
  • సేకరణ 15వేల లీటర్లకు పడిపోయిన వైనం
  •  
    అబ్బో ఎంత తేడా..వేల లీటర్ల సేకరణ పడిపోతుందా..? నెలనెలా గణనీయంగా తగ్గుతున్నా పట్టింపు ఉండదా..? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఖమ్మంలోని ప్రభుత్వ డెయిరీ దైన్యం చూస్తుంటే. రోజుకు 25వేల లీటర్ల పాలు సేకరించిన స్థాయి నుంచి ఇప్పుడు 5వేల లీటర్లకు పడిపోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రణాళిక లేకనా..? పట్టింపు కరువయ్యా..? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రోత్సాహకం నిలిచి..పాడి రైతులు క్రమంగా దూరమయ్యాక ఇప్పుడు బాధ్యులు మేల్కొంటున్న దుస్థితి నెలకొంది. 
     
     
    ఖమ్మం వ్యవసాయం: 
    జిల్లా కేంద్రం ఖమ్మంలోని ప్రభుత్వ (విజయ) డెయిరీ పాల సేకరణ పడిపోయి వెలవెలబోతోంది. కొన్ని నెలల క్రితం వరకు 25 వేల లీటర్ల పాలు సేకరించిన ఈ యూనిట్‌ ప్రస్తుతం 5 వేల లీటర్ల సేకరణకు ఖమ్మం రోటరీనగర్‌లోని 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పాట్లు పడుతోంది. పరిశ్రమ, ప్లాంట్‌ నిర్వహణకు 45 మంది ఉద్యోగులు(ప్రభుత్వ, అవుట్‌ సోర్సింగ్‌) పనిచేస్తున్నా, జిల్లాలో 240 పాల సేకరణ కేంద్రాలున్నా ఇలా ఎందుకు జరిగిందంటే జవాబు లేదు. గతంలో 6 వేల మంది రైతులు నిత్యం పాలు పోసేవారు. 
     
    గ్రాఫ్‌..డమాల్‌
    – ఈ ఏడాది జనవరిలో జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ 21 వేల లీటర్ల పాలను సేకరించింది. 
    – ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా స్వల్పంగా తగ్గినా అంతే స్థాయిలో పాల సేకరణ జరిగింది. 
    – ఆయా నెలల్లో లీటరు రూ.4ల ప్రోత్సాహకం పాల బిల్లులతో పాటు వచ్చాయి. 
    – ఏప్రిల్‌ నెల నుంచి వరుస నెలల్లో పాల సేకరణ పడిపోయింది. 
    – ఆగస్టు నాటికి నిత్యం 5 వేల లీటర్లు మాత్రమే రైతులు ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తున్నారు. 
     
    ప్రోత్సాహకం లేదు..
    పాలు రావట్లేదు..
    పాలు పోసే రైతులకు ప్రభుత్వం లీటరు ఒక్కంటికి రూ.4ల చొప్పున ప్రోత్సాహం చెల్లిస్తామని ప్రకటించింది. 2014 నుంచి అందించినా..ఈ ఏడాది మార్చి తర్వాత విధానపరమైన మార్పులతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సొమ్ము రైతుల బ్యాక్‌ ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా..ఆచరణలో లోపాలతో రైతులు అసౌకర్యం చెందారనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ నుంచి ఐదు నెలల ప్రోత్సాహకాలు అందట్లేదు. జిల్లా రైతులకు రూ.52 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. ఈ కారణంగా కూడా వేలాది మంది రైతులు దూరమవుతున్నారు. 
     
    పాల కోసం..ఊళ్లకు పయనం
    ప్రభుత్వ డెయిరీకి పాలు పోయాలని, ప్రోత్సాహకాలు అందుతాయని వివరిస్తూ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్‌ సామినేని హరిబాబు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సంస్థ ఉప సంచాలకులు క్రొవ్విడి కామేష్‌రావులు ఊరూరా తిరుగుతున్నారు. ఖమ్మం, పాలేరు నియోజక వర్గాల్లో చైర్మన్‌ తిరుగుతండగా, ఉపసంచాలకులు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, రైతులను కలుస్తూ అభ్యర్థిస్తున్నారు. 
మరిన్ని వార్తలు