అవే వజ్రాయుధాలు!

1 Dec, 2015 10:37 IST|Sakshi
అవే వజ్రాయుధాలు!
వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం అతలాకుతలమవుతోంది. కరువు, కుంభవృష్ఠి, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పంటలన్నిటినీ అస్తవ్యస్థం చేస్తున్నాయి. రానున్న కాలంలో ఉష్ణోగ్రత 2-5 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. భూసారం అడుగంటింది. పోషకాహార భద్రత లేదు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో వర్షాధారంగా సేద్యం చేస్తున్న మెట్ట రైతు తన బతుకు బండిని కనీస భరోసాతో నడిపించుకోవడం ఎలా? బడుగు రైతు తనను తాను నిలబెట్టుకుంటూ.. భూసారాన్ని రక్షించుకుంటూ.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఉన్నంతలో దోహదపడే సంప్రదాయ పంటలు, పేద రైతులకు అనువైన సేద్య పద్ధతులు ఏవి? ఇటువంటి మౌలిక ప్రశ్నలన్నిటికీ దీటైన సమాధానం...
 
మిశ్రమ (చిరుధాన్యాలు + పప్పుధాన్యాలు + నూనెగింజల) పంటల సేంద్రియ సేద్య పద్ధతేనని అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన రైతులు ముక్తకంఠంతో చాటి చెప్పారు. సంక్షోభం నుంచి రైతాంగ సమాజం బయటపడడానికి ఇటువంటి చైతన్యంతో కూడిన సేద్యమే సర్వోన్నత మార్గమని ఎలుగెత్తి చాటారు. జాతిని పీడిస్తున్న సూక్ష్మపోషకార లోపాన్ని పారదోలడం చిరుధాన్యాలతోనే సాధ్యమన్నారు. మిల్లెట్స్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా (మిని) సంస్థ నిర్వహించిన ‘చిరుధాన్యాలపై జాతీయ సమాలోచన’లో పాల్గొన్న పలువురి అభిప్రాయాలను ‘సాగుబడి’ పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం.. 
 
కరువులోనూ...
చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మాకు ఐదెకరాల భూమి ఉంది. ఎకరంలో వరి, అరెకరంలో కంది, మినుము వంటి పప్పు పంటలు వేస్తున్నాను. మూడున్న ఎకరాల్లో జొన్న, సజ్జ, కొర్ర తదితర చిరు ధాన్యాలు పండిస్తున్నాం. కరువు కాలంలోనూ చిరుధాన్యాల దిగుబడి పర్వాలేదు. పశువుల ఎరువు తప్ప ఇంకా ఎటువంటి ఎరువూ వేయం. మేం తినడానికి అట్టిపెట్టుకొని, మిగతా గింజలను లోకల్ మార్కెట్‌లో అమ్ముకుంటాము. 
- సుబేరి మల్లిక్, భలేపాని గ్రామం, ఖందమాల్, ఒడిశా
 
సమస్య ఏకపంటలతోనే...
మాది కరువు ప్రాంతం. భూగర్భంలో అంతా ఉప్పు నీరు. సాగంతా వర్షాధారమే. నా 8 ఎకరాల పొలంలో 28 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. జొన్న, సజ్జ, కొర్ర, రాగులు, దేశీ (జయధర్) పత్తి, మిరప, వేరుశనగ, ఉలవ, ఉల్లి, కూరగాయలు.. వంటి పంటలు మిశ్రమ సాగు చేస్తున్నా. మా జిల్లాలో 110 మంది సేంద్రియ రైతులు సంఘంగా ఏర్పడ్డాం. వివిధ ఆహారోత్పత్తులను తయారు చేసి ముంబై, బెంగళూరులో దుకాణ దారులకు అమ్ముతున్నాం. సగటున ఎకరానికి రూ. 30 వేల వరకు ఆదాయం పొందుతున్నాం. కర్ణాటకలో సేంద్రియ రెతైవరూ ఆత్మహత్య చేసుకోలేదు. చెరకు, పత్తి, మొక్కజొన్న, వరి పంటలను ఏక పంటలుగా (మోనోకల్చర్) రసాయనాలతో సాగు చేసే రైతులే ఆత్మహత్యల పాలవుతున్నారు. 
- భర్మ గౌడ, యలవర్తి, గదక్ జిల్లా, కర్ణాటక
 
రెండే వానలైనా...
ఎకరం పావు సొంత పొలంలో సేంద్రియ పత్తి, కౌలుకు తీసుకున్న 4 ఎకరాల్లో సజ్జ, జొన్న, నువ్వులు సాగు చేస్తున్నాం. రెండేళ్లుగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. పశువుల ఎరువు వేస్తాం. చీడపీడలు తక్కువే. అప్పుడప్పుడూ వెల్లుల్లి - మిరప కషాయం పిచికారీతో పురుగుల నుంచి పంటను కాపాడుతున్నాం. మరీ అవసరమైతే పంచగవ్య చల్లుతాం. ఈ సంవత్సరం రెండంటే రెండే వానలు పడ్డాయి. రసాయనిక ఎరువులు వేసిన ఇతర రైతుల పొలాలు ఎండిపోయాయి. మా పొలంలో పంటలు ఎండలేదు. ఎరువులు, పురుగు మందులకు ఇతర రైతులు పెట్టే ఖర్చులో మాకు 10 శాతమే ఖర్చు అవుతుంది. జనం మా ఇంటికి వచ్చి మార్కెట్ ధరకన్నా 20-30 శాతం ఎక్కువ డబ్బిచ్చి సజ్జలు, జొన్నలను కొనుక్కెళ్తున్నారు. మా పొలాలు చూసి.. మరో ఇద్దరు మహిళా రైతులు కూడా చిరుధాన్యాలను పండిస్తున్నారు. 
 - ఖతిజ, ఖిరాయ్ గ్రామం, మోర్బి జిల్లా, గుజరాత్ 
 
ప్రభుత్వం ప్రోత్సహించాలి
మాకు మూడున్నరెకరాల పొలం ఉంది. 20 ఏళ్లుగా సేంద్రియ చెరకు పండించే వాడ్ని. 2009 తర్వాత నుంచి కరువు కాలం వచ్చింది. పత్తి, వేరుశనగ వేస్తే.. అడవి పందులు, నెమళ్లు, కోతులు పంట చేతికి రానివ్వటం లేదు. నాలుగేళ్ల క్రితం తొలిసారి అరెకరంలో కొర్ర సాగు చేశా. 4.5 క్వింటాళ్లు పండింది. గింజ సన్నగా ఉంటుంది కాబట్టి కోతులు కొర్ర జోలికి అంతగా రావటం లేదు. ఈ ఏడాది మూడెకరాల్లో కొర్ర, సోయా, కంది వేశా. 18.5 క్వింటాళ్ల కొర్రలు, అర క్వింటా సోయా చిక్కుళ్లు పండాయి. కొర్ర ధాన్యాన్ని క్వింటా రూ. 3 వేలు చొప్పున డీడీఎస్‌కు అమ్మా. వచ్చే ఏడాది 20 ఎకరాల్లో ఈ పంటలు వేయాలనుకుంటున్నా. చిరు ధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం నెలకొల్పాలి. మధ్యాహ్న భోజనంలో చిరు ధాన్యాలు వాడాలి. అలాగైతేనే కరువు కాలంలోనూ రైతు బతకగలుగుతాడు. ఆత్మహత్యలు ఆగుతాయి. జాతి ఆరోగ్యమూ బాగుపడుతుంది. 
 - ఎడ్ల నారాయణరెడ్డి (94901 28782),  ఇబ్రహీంపురం, మన్నెవారి  దుర్గపల్లి, నల్గొండ జిల్లా 
 
బలమైనతిండి
మా ఎవుసం భూతల్లికి, మనుషులకి, పశువులకు, పక్షులకు, గాలికి.. మంచిది. మా ఇత్తనంతోనే జొన్నలు, సజ్జలు, కొర్రలు, పెసలు, మినుములు, ఉలవలు, తొగళ్లు.. కలిపి పండిస్తున్నం. పొలంలో అన్ని రకాల ఆకులు రాలతై. భూతల్లిని కూడా కాపాడినట్టయితుంది. పశువులకు గడ్డి వస్తుంది. పిట్టలు బతుకుతై. పొలంలో పెరిగే ఆకులు తెంపుకొచ్చి తింటం. ఇది చాలా బలమైన తిండి. మందులేసుడు, భూమిని గట్టిగ చేసుడు, గాలిని ఆగం చేసుడు అసలు లేదు. పెంట ఎరువేస్తం. 30 ఏళ్లలో రేగడి భూములకన్నా మా భూములు బాగా తయారైనై. నాలుగైదు వానలే పడినా సగం దిగుబడికి భరోసా ఉంది. 
 - సమ్మమ్మ, డీడీఎస్ మహిళా రైతు సంఘం, జహీరాబాద్, మెదక్ జిల్లా
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు