అరకొరగా డబ్బొచ్చింది!

28 Dec, 2016 01:08 IST|Sakshi
అరకొరగా డబ్బొచ్చింది!

 జిల్లాకు రూ.150 కోట్ల నగదు పంపిణీ  
ఇందులో రూ.30 శాతం కొత్త రూ.500 నోట్లు
నెలాఖరులోగా ఆర్బీఐ నుంచి   మరికొంత సొమ్ము


విశాఖపట్నం : అసలే పండగ సీజను. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే తరుణం వస్తోంది. కొత్త దుస్తులు, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి సాధారణ రోజులకంటే ఎక్కువ సొమ్ము అవసరమవుతుంది. కానీ బ్యాంకుల్లో సరిపడినంత డబ్బున్నా చేతిలోకే రావడం లేదు. బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగడం లేదు. ఏటీఎంల వద్దకు వెళితే రూ.2 వేలకు మించి తీసుకునే వీలుండడం లేదు. గంటల తరబడి వేచి ఉంటే కొత్త రూ.2 వేల నోటే వస్తోంది. పెద్ద నోట్లు రద్దయిన 48 రోజుల నుంచి జనం ఇలాంటి కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు. మధ్యమధ్యలో రిజర్వు బ్యాంకు నుంచి నగదు వస్తున్నా అది రెండు మూడు రోజులకే సరిపోతోంది. మళ్లీ డబ్బు కొరత వేధిస్తోంది. విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ లావాదేవీలకు రోజుకు దాదాపు రూ.100 కోట్ల నగదు అవసరమవుతోంది. కానీ ఆర్బీఐ నుంచి వచ్చిన డబ్బు ఇలా రాగానే అలా అయిపోతోంది.  

విశాఖకు వచ్చింది తక్కువే..
ఈ నెల 20న ఆర్బీఐ నుంచి విశాఖ స్కేబ్‌కు పెద్దమొత్తంలో రూ.1550 కోట్ల సొమ్ము వచ్చింది. ఇందులో విశాఖకు రూ.300 కోట్లు కేటాయించగా మిగిలిన సొమ్ము రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల చెస్ట్‌ బ్రాంచిలకు పంపించారు. ఆ తర్వాత ఆర్బీఐ నుంచి ఈ నెల 26న మరో రూ.2400 కోట్లు స్కేబ్‌కు వస్తాయని బ్యాంకు అధికార వర్గాలు చెప్పాయి. కానీ అందులో మూడో వంతు అంటే.. రూ.805 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో విశాఖకు రూ.150 కోట్లు కేటాయించినట్టు సమాచారం. ఈ మొత్తంలో స్టేట్‌ బ్యాంకుకు రూ.45 కోట్లు, ఆంధ్ర బ్యాంకు చెస్ట్‌లకు రూ.105 కోట్లను పంపిణీ చేసినట్టు తెలిసింది. తాజాగా కేటాయించిన ఈ రూ.150 కోట్లను నగరంలోని వివిధ బ్రాంచిలకు పంపడంతో మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న నిల్వతో పాటు కొత్తగా వచ్చిన నగదు వెరసి రెండు రోజులకు మించి సరిపోదని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నెలాఖరులోగా ఆర్బీఐ మరింత సొమ్ము పంపనుందని తెలుస్తోంది.
 
తాత్కాలిక ఉపశమనం..
ఇలావుండగా కొత్తగా వచ్చిన రూ.150 కోట్లలో 30 శాతం కొత్త రూ.500 నోట్లున్నాయి. ఈ నోట్లలో కొంత మెత్తాన్ని ఏటీఎంల్లో ఉంచుతున్నారు. దీనివల్ల తాత్కాలికంగా కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రూ.2వేల నోట్లతో చిల్లర సమస్యలు ఎదుర్కొంటున్న జనానికి ఊరట కలగనుంది. కొన్నాళ్ల క్రితం పరిస్థితిని గమనిస్తే మంగళవారం ఏటీఎంల వద్ద క్యూలు కట్టిన జనం అంతగా కనిపించలేదు.

>
మరిన్ని వార్తలు