‘గుడిసె గృహా’నికి కోటి పరిహారం

4 Nov, 2015 03:59 IST|Sakshi
‘గుడిసె గృహా’నికి కోటి పరిహారం

♦ జూరాల ముంపుగ్రామం నాగర్‌దొడ్డి గృహ పరిహార అంచనాల్లో అక్రమాలు
♦ 20 కోట్ల రూపాయల మేర అవకతవకలు
♦ గుడిసెలను గృహాలుగా చూపి తప్పుడు పరిహారాలు
♦ కమిటీ విచారణలో అక్రమాల నిర్ధారణ.. ప్రభుత్వానికి నివేదిక
 
 సాక్షి, హైదరాబాద్: అడ్డగోలు అంచనాలు.. ఇష్టారీతిన పరిహార మదింపు.. అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు అంతా కుమ్మక్కు. వెరసి కోట్లు కొట్టేసేందుకు పక్కావ్యూహం. రూ. 5 లక్షలు కూడా విలువ చేయని గుడిసెల్లాంటి నిర్మాణాలకు ఏకంగా రూ. 20 లక్షల నుంచి కోటి వరకు అంచనాలు రూపొందించారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ముంపు గ్రామం నాగర్‌దొడ్డిలో ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ గుర్తించిన వాస్తవాలివీ. 148 గృహాల నిర్మాణానికి ఏకంగా రూ.20 కోట్లతో అంచనాలు రూపొందించి పరిహారాన్ని ఫలహారం చేద్దామనుకున్న గుట్టును కమిటీ నిర్ధారించింది. ఇందులో అటవీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారుల ప్రమేయం ఉందని తన నివేదికలో బల్లగుద్ది చెప్పింది.

 ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద మొత్తంగా 11 ముంపు గ్రామాలను గుర్తించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా ధారూర్ మండలం నాగర్‌దొడ్డి గ్రామం ప్రాజెక్టు ముంపుభాగంలోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) నుంచి 100 మీటర్ల పరిధిలోని భూమిని సేకరించాలని ముందుగా నిర్ణయించారు. ఈ పరిధిలోకి వచ్చే గృహాలు, చెట్లు, స్థలాలు, వ్యవసాయ బావులు, ఇతర నిర్మాణాలు ఏవి ఉన్నా వాటికి ప్రభుత్వం నిర్ధారించిన రేట్లతో పరిహారం చెల్లించాలి. ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. 100 మీటర్ల పరిధి అన్న నిబంధనను మార్చి మరింత ఎక్కువ పరిధితో లెక్కలుగట్టి పరిహారాన్ని పెంచారు.

ఇందు లో భాగంగానే నాగర్‌దొడ్డిలో 148 నిర్మాణాలను రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖలు ముంపు గృహా లుగా గుర్తించి, పరిహార అంచనాలు సిద్ధం చేశాయి. ఇందులో అధికారులతో పాటు అన్ని పార్టీల నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో దీనిపై గత నెల 18న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదికను ఆర్ అండ్ ఆర్ కమిషనర్ మాణిక్‌రాజ్ మంగళవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషికి అందజేశారు.

 గుడిసెకు రూ.కోటి అంచనా
 విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. నాగర్‌దొడ్డిలో వాస్తవంగా చూపిన గృహ నిర్మాణాలన్నీ అప్పటికప్పుడు, హడావుడిగా ఎక్కువ పరిహారాన్ని కొట్టేసేందుకు వేసినవేనని కమిటీ గుర్తించింది. రూ.లక్ష కూడా విలువ చేయని ఇంటికి పది లక్షలు, పది లక్షల విలువ చేసే ఇంటికి రూ.1.05 కోట్ల వరకు అంచనాలు రూపొందించారు. కొన్ని గృహాల్లో 2 మీటర్లకో పిల్లర్ చొప్పున నిర్మాణాలు చేసినట్లుగా చూపారు. ఇక గృహ నిర్మాణంలో 25-30 శాతం మాత్రమే కలప వాడాల్సి ఉన్నా, 60 శాతానికి తక్కువ కాకుండా వాడినట్లు చూపారు. కొన్ని గృహాల్లో 90 శాతం కలప వినియోగించినట్లు చూపారు.

కలపకు అటవీ శాఖ నిర్ణయించిన ధర అధికంగా ఉన్నందునే గుడిసెల్లాంటి నిర్మాణాలకు ఉద్దేశపూర్వకంగా కలపను వాడినట్లు కమిటీ నిర్ధారించింది. పూర్తిగా అతుక్కున్నట్లుగా నిర్మించిన ఈ గృహాల్లోకి వెళ్లడానికి కనీసం మనిషి కూడా పట్టనంత ఇరుకుగా సందుల నిర్మాణం, నివాసానికి యోగ్యం కాని రీతిలో నిర్మించడం సైతం అనుమానాలకు తావిస్తోందని తేల్చింది. ఇలా మొత్తంగా 148 గృహాలకు రూ. 20 కోట్ల పరిహారాలను లెక్కించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ నీటి పారుదల శాఖకు లేఖ రాశారని, దీనికి అనుగుణంగా శాఖ ఈఎన్‌సీ సైతం సంబంధిత అధికారులకు మెమో జారీ చేసినట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు