రైతన్నల ఆశలు ఆవిరి

5 Jul, 2016 08:41 IST|Sakshi
రైతన్నల ఆశలు ఆవిరి

ఏళ్ల తరబడి సాగుతున్న భవనాశి మినీ రిజర్వాయరు పనులు
ప్రాజెక్టు వ్యయం రూ.27 కోట్లు
ఏయేటికాయేడు పూర్తవుతుందని ఎదురు చూస్తున్న రైతులు
పనులు పూర్తికాకపోవడంతో నైరాశ్యంలో రైతాంగం

పాలకుల నిర్లక్ష్యమో, అధికారుల ఉదాసీనతో తెలియదు కానీ, కోట్లకు కోట్లు ఖర్చుచేసి కడుతున్న ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూ రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. అనుకున్న సమయంలో పనులు పూర్తికాకపోవడంతో పచ్చని పంట పొలాలుగా మారాల్సిన భూములు బీడువారి రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. 7 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రారంభించిన భవనాశి రిజర్వాయర్ పనులు నత్తకు నడకలు నేర్పుతూ పాలకుల ఉదాసీనతకు ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తున్నారుు.

అద్దంకి : అద్దంకి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో భవనాశి చెరువును మినీ రిజర్వాయరుగా మార్చాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. తద్వారా ప్రస్తుతం ఉన్న 1798 ఎకరాల ఆయకట్టును పెంచి, 7 వేల ఎకరాలకు నీరందించాలని సంకల్పించారు. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నదికి అడ్డంగా చెక్‌డ్యామ్ నిర్మించి, దాని నుంచి ఫీడరు చానల్ ఏర్పాటుతో, చెరువుకు నీరు తెచ్చి మినీ రిజర్వాయరుగా మార్చాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా జలయజ్ఞంలో ప్రాజెక్టుగా గుర్తింపునిచ్చి, రూ.27 కోట్ల నిధులు కేటాయించారు. 2008లో దేవస్థానానికి ఎదురుగా పనుల ప్రారంభం కోసం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. 2010 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

 ప్రారంభంలోనే జాప్యం: వెంటనే పనులు మొదలు పెట్టాల్సిన కాంట్రాక్టరుకు రెవెన్యూ శాఖ నుంచి భూముల అప్పగింత కార్యక్రమం పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ఎట్టకేలకు 2013లో  రెవెన్యూ శాఖ భూముల అప్పగింతతో పనులు మొదలయ్యాయి.

రిజర్వాయరు పనులు మూడు భాగాలుగా విభజన..
మినీ రిజర్వాయరు పనులను మూడు భాగాలుగా విభజించారు. ప్రాజెక్టుకు కేటాయించిన రూ.27 కోట్ల నిధుల్లో రూ.7.35 కోట్లు గుండ్లకమ్మ నదిలో చెక్‌డ్యామ్ నిర్మాణానికి కేటాయించగా ఆ పనులు పూర్తయ్యాయి.

పూర్తై చెరువు కట్ట ఎత్తుపెంపు పనులు..
రిజర్వాయరు పనుల్లో రెండో భాగమైన భవనాశి చెరువు కట్ట ఎత్తుపెంపు, చక్రాయపాలెం వద్ద 200 మీటర్ల పొడవున అలుగు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీని కోసం రూ.1.71 కోట్లు కేటాయించారు.

నిలిచిన ఫీడర్ చానల్ పనులు..
బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం చెక్‌డ్యామ్  నుంచి మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల, చక్రాయపాలెం వరకూ 12.6 కిలోమీటర్ల ఫీడర్ చానల్ నిర్మాణం కోసం 192 ఎకరాల భూమిని సేకరించి రూ.13.74 కోట్లు కేటాయించారు. ఈ పనులు మధ్యలో నిలిచిపోయాయి. ప్రస్తుతం వెంపరాల చెరువు నుంచి చక్రాయపాలెం వరకూ కాలువ తీశారు.

ప్రాజెక్టు సర్వేలో గుర్తించని 7.25 ఎకరాల భూమితో చిక్కు..
ప్రాజెక్టు కాలువ కోసం సేకరించిన భూమిలో మండలంలోని మైలవరం, ఉప్పలపాడు గ్రామాల రైతులకు చెందిన 7.25 ఎకరాలను నష్టపరిహారం జాబితాలో చేర్చకపోవడంతో ఆ భూముల్లో కాలువ తవ్వేందుకు ఆటంకం ఏర్పడింది. కొత్తగా వచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం ఆ భూముల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తేనే అక్కడ కాలువ తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ పనిని రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంది.

నిలిచిన బ్లాస్టింగ్ పనులు..
తీసిన కాలువలో చట్టు(రాయి) పడటంతో దాన్ని బ్లాస్టింగ్ చేయాల్సి వచ్చింది. బ్లాస్టింగ్‌కు అనుమతి తెచ్చి పనులు మొదలు పెట్టినా, ధ్వనుల మోతకు మైలవరం, ఉప్పలపాడు గ్రామాల్లో ఇళ్లు నెర్రెలిస్తున్నాయని స్థానికులు ఆందోళన చేయడంతో ఆ పనులు నిలిచిపోయాయి.

విద్యుత్ స్తంభాల అడ్డంకులు..
ఇదే కాలువలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉండటం, వాటిని తొలగించడానికి విద్యుత్ శాఖ అధికారుల అనుమతులు రాకపోవడంతో తీసిన కాలువలోనూ పనులు జరగటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది అక్టోబరు నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.

కదలాల్సిన యంత్రాంగాలు..
ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే అటు రెవెన్యూ, ఇటు విద్యుత్ శాఖ అధికారుల నుంచి అనుమతుల మంజూరు, నష్టపరిహారం ఇవ్వాల్సిన రైతులకు రెవెన్యూ శాఖ ద్వారా నష్టపరిహారం ఇవ్వడంతోపాటు, బ్లాస్టింగ్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాలు జిల్లా ఉన్నతాధికారులు గమనించి ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు వేడుకొంటున్నారు.

మరిన్ని వార్తలు