కనిపించని కనీస సౌకర్యాలు

17 Sep, 2016 18:24 IST|Sakshi
కనిపించని కనీస సౌకర్యాలు
మునుగోడు : పేరుగొప్పు ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది మునుగోడు మండలకేంద్రం పరిస్థితి. పేరుకే నియోజకవర్గకేంద్రం కానీ ఇక్కడ కనీసం సౌకర్యాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. సీసీ రోడ్ల నిర్మాణం కూడా అంతంత మాత్రమే.. ఏ వీధిలో కూడా సరిగ్గా మురికి కాల్వలు లేకపోవడంతో చిన్నపాటి వర్షమెుస్తేచాలు మురికి కూపాలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో వివిధ కాలనీలోని ఇళ్ల చుట్టూ మురికి నీరు నిలిచి బురదమడుగులు, కుంటలను తలపిస్తున్నాయి. ఇక కొత్తగా ఏర్పడుతున్న కాలనీలనైతే పట్టించుకునే నాథులే లేకుండా పోయారు. ఫలితంగా దోమలు, ఈగలు ప్రబలుతుండడంతో జనం విషజ్వరాల బారిన పడుతున్నారు. కొందరు డెంగీ వ్యాధి లక్షణాలో ఆస్పత్రుల పాలై వైద్యసేవలు పొందుతున్నారు. అయినా సంబంధిత పంచాయతీఅధికారులు, పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వీధుల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగుకాల్వలు నిర్మించాలని చండూరురోడ్డు, ఇందిరమ్మ, జర్నలిస్టు కాలనీల ప్రజలు కోరుతున్నారు.  
 
మరిన్ని వార్తలు