హద్దులు దాటుతున్న మైనింగ్ మాఫియా

4 Jun, 2016 12:14 IST|Sakshi
హద్దులు దాటుతున్న మైనింగ్ మాఫియా

కాల్సైట్ తవ్వకాల్లో నిబంధనలకు పాతర
మామ్మూళ్ల మత్తులో అధికారులు

 అనంతగిరి:  మండలంలోని వాలాసి పంచాయతీ నిమ్మలపాడులో నిబంధనలకు విరుద్ధంగా కాల్సైట్ మైనింగ్ చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదన వ్యక్తమవుతోంది. రూ. కోట్లు విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టడం వారి నిబద్ధతకు అద్దం పడుతోంది. వాలాసి పంచాయతీ రాళ్లగరువు, కరకవలస, నిమ్మలపాడుల్లో గిరిజనుల పేరిట ఉన్న దుర్గా సోసైటీ ఆధ్వర్యంలో 3.5 హెక్టార్లు విస్తీర్ణంలో కొన్నేళ్లుగా మైనింగ్ జరుపుతున్నారు. ఈ క్వారీని ఆనుకొని ఉన్న ఏపీఎండీసీకి చెందిన క్వారీలో మైనింగ్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో 5.96 హెక్టార్లల్లో కాల్సైట్ తవ్వకాలకు ఏపీఎండీసీ టెండరు పిలిచింది. టెండర్లు ఖరారు కాక ముందే సంస్థకు చెందిన స్థలంలోకి కొందరు చొరబడి తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను సైతం జరిపి తవ్వకాలు కొనసాగిస్తున్నారన్నది వాదన. లారీలతో బొడ్డవరకు రవాణా చేస్తున్నప్పుడు మలుపుల వద్ద తెల్లరాయి రోడ్డుపై పడుతోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు.

 ఒకే బిల్లుతో అక్రమ రవాణా...
మైనింగ్‌తో పాటు కాల్సైట్ రవాణా సైతం నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. నిమ్మలపాడు మైనింగ్ ప్రాంతం నుంచి విజయనగరం జిల్లా బొడ్డ వరకు రోజూ 20 నుంచి 30 లారీల లోడ్లు రవాణా చేస్తున్నారు. ఒకే పర్మిట్‌తో రెండు మూడు లోడ్లు తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం విషయంలో మైనింగ్ అధికారులు చేతులు ఎత్తేయడంతో మాఫియా ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఈ క్వారీపై గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి కేసు నమోదు చేశారు. దుర్గా సొసైటీ పేరుతో క్వారీని నడుపుతున్న బినామీ వ్యక్తి తన పలుకుబడితో ఆ కేసును మాఫీ చేసుకున్నట్టు సమాచారం. దీనిపై మండల తహసీల్దార్ రాణీ అమ్మాజీ మాట్లాడుతూ సర్వేయర్ అందుబాటులో లేరని, వచ్చిన వెంటనే సర్వే చేపట్టి హద్దులు నిర్ణయిస్తామన్నారు.అక్రమాలు జరిగినట్టు రుజువైతే కేసు నమోదు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు