అచ్చెన్న నీటి మూటలు

9 Apr, 2017 15:28 IST|Sakshi
అచ్చెన్న నీటి మూటలు

► నత్తనడకన వంశధార ప్రాజెక్టు పనులు
► బడ్జెట్‌లో నిధులు అంకెలకే పరిమితం
► జూన్‌ నాటికి సాగునీరు హామీ హుష్‌కాకి!
► కాంట్రాక్టర్లు టీడీపీ నేతల అనుయాయులే
► హెచ్చరికలు సమీక్ష సమావేశాలకే పరిమితం?


వంశధార ప్రాజెక్టు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే రిజర్వాయరు పనులు 80 శాతం, 87, 88 ప్యాకేజీల్లో 20 శాతం చొప్పున పూర్తయ్యాయి. ప్రాజెక్టును సాకారం చేస్తామంటూ గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు! మంత్రి అచ్చెన్నాయుడు మరో అడుగు ముందుకేసి... ఈ ఏడాది జూన్‌ నాటికే రిజర్వాయర్‌లో నీరు నింపిస్తామంటూ ఊరిస్తూ వచ్చారు. తీరా ఈ మూడేళ్లలో జరిగిన పనులు చూస్తే పట్టుమని పది శాతం మించలేదు. దీనికి కారణం కాంట్రాక్టర్ల అలసత్వమేనంటూ నెపం వారిపై నెట్టేసే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు! కానీ మరోవైపు జిల్లాలో నదులు అనుసంధానం చేసేస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు!

సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: అభివృద్ధిలో వెనుకబడిన ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన వంశధార ప్రాజెక్టు పనులకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేశారు. భారీగా నిధులు కేటాయించారు. దీంతో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. హిరమండలం రిజర్వాయరు పనులు దాదాపు పూర్తయ్యాయి. వరద కాలువ, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల పనులకు ఉద్దేశించిన 87, 88 ప్యాకేజీల పనులు 20 శాతం చొప్పున జరిగాయి. వైఎస్సార్‌ అకాల మరణం తర్వాత పనులు నిలిచిపోయాయి. వంశధార ప్రాజెక్టు సామర్థ్యం 19 టీఎంసీలు. కొద్దిపాటి పనులు చేస్తే ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశం ఉంది. అందుకే వచ్చే జూన్‌ నాటికి నీరు పారిస్తామంటూ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెబుతూవచ్చారు. కానీ తమకు న్యాయం చేయకుండా అధికార బలం ప్రయోగించి పనులు చేసేందుకు ముందుకెళ్లడంతో గత జనవరి నెలలో నిర్వాసితులు విధ్వంసం సృష్టించారు. కాంట్రాక్టర్ల ఆస్తులకు నిప్పుపెట్టారు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఇటీవల బడ్జెట్‌లో కూడా వంశధారకు అరకొరగానే ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ.600 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదిస్తే కేవలం రూ.54 కోట్లు మాత్రమే విదిల్చింది. అదీ అంకెల్లోనే!

నత్తనడకన పనులు...: ప్రాజెక్టు 87 ప్యాకేజీలో మొత్తం 13 కిమీ పొడవున మట్టి, సిమెంట్‌పనులుచేయాల్సి ఉంది.తొలుత ఈ పనులను హార్వి న్స్‌ సంస్థ చేపట్టింది. ఏడు కిలోమీటర్ల మేర పూర్తి చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు అప్పగించారు.కానీ ఇప్పటివరకూ కేవలం రెండు కిలోమీటర్ల మేరకుమాత్రమే పనులుపూర్తయ్యాయి. ఇంకా నాలుగు కిలో మీటర్ల మేర పనులు మిగిలిఉన్నాయి. దీనిలోనే వంతెనలు, కెనాల్స్‌ వంటి సిమెంట్‌ పనులు చేయాల్సి ఉంది. ఇవన్నీ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది.

► 88 ప్యాకేజీ కింద మొత్తం 20 కిమీ మేర మట్టి, సిమెంట్‌ పనులు చేయాల్సి ఉంది. కానీ 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీనిలో 20 శాతం పనులు చేసిన శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థను తొలగించి టీడీపీ ప్రభుత్వం సాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు అప్పగించింది. ఇది టీడీపీ నాయకుల అనుయాయులకు చెందినదే కావడం విశేషం.

► హిరమండలం రిజర్వాయరు పనుల్లో భాగంగా ప్రస్తుతం స్పిల్‌వే లింక్, కెనాల్‌ కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. స్పిల్‌వే పనుల్లో భారీ బండరాయి పడింది. దీన్ని ఎలా తొలగించాలనేదీ ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. ఇక ఎర్త్‌డ్యామ్, గట్టు రాతి కట్టడాల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

పెండింగ్‌ బాధ్యత టీడీపీ నేతలదే..: వంశధార పనులు సకాలంలో పూర్తిగాకపోవడానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నేతల వైఖరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 అక్టోబరు నాటికి పనులు పూర్తిచేయాలనే షరతుతో గత ఏడాది కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తీరా అవి పనులు మొదలు పెట్టేసరికి నిర్వాసితుల సమస్య తెరపైకి వచ్చింది. పోలీసు బలంతోనైనా పనులు పూర్తి చేస్తామని మంత్రి అచ్చెన్న సమీక్ష సమావేశంలో హెచ్చరించడం, ఇదే అదనుగా పోలీసులను మోహరించి దుగ్గుపురం రోడ్డును తవ్వించేయడంతో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. యంత్రాలు ధ్వంసం కావడంతో కాంట్రాక్టు సంస్థలు రెండు నెలల పాటు పనులు నిలిపేశాయి. ఇప్పటికిప్పుడు ప్రారంభించినా అక్టోబరు నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. జూన్‌ నుంచి వర్షాలు ప్రారంభమైతే పనులు జరగవు. మిగిలిన ఏప్రిల్, మే నెలల్లో ఎంతమేర జరుగుతాయనేదీ అనుమానమే! ఈ పనుల పెండింగ్‌కు బాధ్యత వహించాల్సిన టీడీపీ నాయకులు... నెపాన్ని కాంట్రాక్టు సంస్థలపై నెట్టేసేందుకు ప్రయత్నించడం గమనార్హం!

మరిన్ని వార్తలు