అయ్యన్న తనయుడి రుబాబు

12 Dec, 2016 15:23 IST|Sakshi
అయ్యన్న తనయుడి రుబాబు

లేట‘రైట్’ అనలేదని గిరిజనులపై కక్షసాధింపు
పింఛన్లు, డ్వాక్రా రుణాల నిలిపివేత
మంత్రిగారి కొడుకు పెత్తనం
అడ్డూ అదుపు లేకుండా ప్రారంభోత్సవాలు

నాయకత్వానికి జై కొట్టాలి.. అక్రమాలు చేసినా ‘రైట్’ అనాలి.. ప్రశ్నించకూడదు.. ఎదిరించకూడదు.. వద్దంటే కక్ష కడతారు.. సామాన్యులను వేధిస్తారు.. సంక్షేమ పథకాలకు దూరం చేసి బాధిస్తారు.. జిల్లాలో అదే జరుగుతోంది. మంత్రి అయ్యన్నపాత్రుడి అండతో ఆయన కుమారుడు విజయ్ పెత్తనం చేస్తున్నాడు. లేటరైట్ అక్రమాలకు అడ్డుపడుతున్నారన్న కోపంతో అమాయక గిరిజనులను సాధిస్తున్నాడు. జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకుని పింఛన్లు, డ్వాక్రా రుణాలు నిలిపేసి వారి పొట్టకొడుతున్నాడు. తండ్రి అండ చూసుకుని తానే మంత్రిలా ప్రవర్తిస్తున్నాడు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేసేస్తున్నాడు. 

విశాఖపట్నం/నాతవరం, మాకవరపాలెం  విలువైన లేటరైట్ తవ్వకాలను గిరిజనులు అడ్డుకోవడం మంత్రి అయ్యన్నపాత్రుడికి, ఆయన తనయుడికి కంటగింపుగా మారింది. నాతవరం మండలం సరుగుడు పంచాయతీలోని సుందరకోట, అసన గిరి, తొరడ, ముంతమామిడిలోద్దు బమ్మిడికలోద్దు, పాత సిరిపురం, కొత్త దద్దుగుల, యరకంపేట, మాసంపల్లి తదితర గ్రామాల్లో లేటరైట్  నిక్షేపాలు పుష్కలంగా ఉన్నారుు. వాటి తవ్వకాల అనుమతుల కోసం కొందరు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోగా గత ఏడాది సుందరకోటలో ప్రజా వేదిక నిర్వహించారు. ఆ సమయంలో అసనగిరి గ్రామస్తులంతా ఏకమై లేటరైట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిగతా గ్రామాల్లో మరికొంతమంది వారికి మద్దతుగా నిలిచారు. లేటరైట్‌కు వ్యతిరేకంగా భీష్మించారు. అరుునా సరే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సుందరకోట, అసనగిరి గ్రామాల సరిహద్దులో నిబంధనలు ఉల్లఘించి అనుమతులు లేకుండా లేటరైట్ తవ్వకాలు నిర్వహించి కోట్లాది రూపాయల లేటరైట్‌ను తరలించుకుపోయారు. 

వ్యతిరేకించిన వారిపై కక్ష
2009లో అప్పటి సర్పంచ్ నిబంధనలు పాటించకుండా లేటరైట్ తవ్వకాలకు అనుమతుల కోసం పంచాయతీ తీర్మానాలు ఇచ్చారు. వీటిపై ప్రస్తుత సర్పంచ్ సాగిన లక్ష్మణమూర్తి అధికారులకు గత ఏడాది ఫిర్యాదు చేశారు. దానిపై అప్పటి కలెక్టర్ యువరాజ్ లేటరైట్ అనుమతులను రద్దు చేశారు. అరుునప్పటికీ రాజకీయ అండతో యథేచ్ఛగా లేటరైట్ తవ్వకాలు జరపడంతో గిరిజనులు ఆందోళన చేసి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో తహసీల్దారు కనకారావు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసి వదిలేశారు. అప్పట్నుంచి లేటరైట్ తవ్వకాలు జరగడం లేదు. దీంతో మంత్రి తనయుడు కక్ష గట్టాడు. లేటరైట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన గిరిజన గ్రామాల్లో సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంక్షేమ పధకాలు నిలుపుదల చేయడంతోపాటు గిరిజనులను భయభ్రాంతులకు గురి చేసి వారికి తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

బాధితులు వీరే..
లేటరైట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన అసనగిరిలో పదేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న పట్టెం రాజులమ్మ, రావుల జోగులమ్మా, పట్టెం వెంకయ్మమ్మ, పాండవుల లక్ష్మి, బురారి సీతమ్మ, చల్లా చెల్లయ్యమ్మ, జర్తా అచ్చియ్యమ్మ, బురారి లక్ష్మి, రెడ్డి గంగ, రెడ్డి కూకాలమ్మ, పాండవుల రాములమ్మా, రావుల అబ్దం, జర్తా అక్కయ్యమ్మ, జర్తా పెద వెంకటస్వామి, వెలుగుల దొంగబాబు, పట్టెం కన్నబాబు, జర్తా అచ్చాలు, చల్లా రాములమ్మతోపాటు మరికొంతమంది పింఛన్లను నిలిపివేశారు. వీరంతా నాలుగు రోజుల క్రితం పల్స్ సర్వే కోసం ఆ గ్రామానికి వెళ్లిన ఆర్‌ఐ సత్యనారాయణ, వీఆర్వో శ్రీనుకు ఫిర్యాదు చేశారు. ఈ గ్రామంలో గల డ్వాక్రా సంఘాలైన గంగాలమ్మాలతోపాటు మరి కొన్ని గ్రూపులకు నేటికీ ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. పసుపు, కుంకుమ పేరుతో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.3 వేల నగదును కూడా తన వర్గం కాని వారికి అందకుండా చేస్తున్నారు. మాసంపల్లి గ్రామంలో కూడా పదేళ్లుగా పింఛనుదారులైన గోము నూకాలమ్మ, ఆర్లంకి అప్పలనర్స, కోచ్చా మల్లయ్య, గోము లక్ష్మి, ముర్ల లక్ష్మి, కోచ్చా లోవలక్ష్మి, గోము సత్యం పింఛన్లు నిలిపివేశారు. ఈ విషయంపై ఎంపీడీవో యాదగిరీశ్వరావును వివరణ కోరగా ఆ గ్రామాల్లో పర్యటించి నిలిచిపోరుున పింఛన్లను పునరుద్ధరించేలా చర్యలు చేపడతానన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రి కొడుకు
మంత్రి అయ్యన్నపాత్రుడి అండతో ఆయన కుమారుడు విజయ్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మాకవరపాలెం మండలంలోని జడ్.గంగవరం, జి.వెంకటాపురం, నగరం, జి.కోడూరు గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను దాదాపు రూ.7 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించారు. వీటిని ప్రారంభించడానికి ఆదివారం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అయ్యన్న కుమారుడు విజయ్ హాజరయ్యారు. ఈ ప్లాంట్లన్నీ ఆయనే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎంపీపీ రుత్తల చిన్నయ్యమ్మ, వైస్ ఎంపీపీ వి.వెంకటరమణ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు ఉన్నా కేవలం ప్రేక్షకపాత్ర పోషించారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రొటోకాల్‌కు భంగం కలిగేలా విజయ్ ప్రారంభోత్సవాలు చేయడం స్థానిక ప్రజాప్రతినిధులను తీవ్రంగా బాధించింది.  

మరిన్ని వార్తలు