'అల్లరి చేస్తే ఊరుకోం... నొక్కిపడేస్తాం'

28 Apr, 2016 19:50 IST|Sakshi
'అల్లరి చేస్తే ఊరుకోం... నొక్కిపడేస్తాం'

-ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం
-చిన్నముల్కనూర్‌లో డబుల్‌బెడ్‌రూం కోసం పలువురి ఆందోళన


చిగురుమామిడి (కరీంనగర్) : 'అభివృద్ధి పనులను అడ్డగించే నీచ సంస్కృతి పోతేనే మనం బాగుపడ్తం. అల్లరి చేస్తే ఊరుకోం.. నొక్కిపడేస్తం' అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌లో గురువారం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతుండగా తమకు ఇండ్లు రాలేదంటూ పలువురు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి ఘాటుగా స్పందించారు. సభలు, సమావేశాలను అడ్డుకుని ఏమి సాధిస్తారన్నారు. అడ్డుకునే సంప్రదాయం ఎక్కడిది? ఇట్లైతే బాగుపడరు. బాగు చేసుకునే విషయంలో ఐక్యత లేకపోతే ఎట్లా?.. అంటూ మండిపడ్డారు. సీఎం దత్తత గ్రామంలో అల్లరిచేసి చెడగొట్టేవారిని కంట్రోల్ చేసేది గ్రామపెద్దలే. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టినా ఇట్ల అల్లరి చేస్తే ఇండ్లు కట్టలేం. మీరు మారాలి. అడ్డుకునే కుసంస్కారం తగదు.. అంటూ డబుల్ బెడ్‌రూం ఇండ్లు రాని బాధితులకు క్లాస్ ఇచ్చారు.

చిన్నముల్కనూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ దత్తత తీసుకుంటే.. మీరు సభలో గోల చేస్తే ఎట్ల.. అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గ్రామంలో ఎంతమంది అర్హులున్నా అందరికీ ఇండ్లు కట్టిస్తామని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో అన్నివర్గాల వారికి ఇండ్లు కట్టిస్తున్నామని, ఇక్కడ కూడా అందరికీ ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మూడు నెలల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు