మాతోనే ఓరుగల్లు అభివృద్ధి

2 Mar, 2016 03:38 IST|Sakshi
మాతోనే ఓరుగల్లు అభివృద్ధి

♦ మీట్ ది ప్రెస్‌లో మంత్రి హరీశ్‌రావు
♦ కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటాం
♦ కాంగ్రెస్, టీడీపీలు నగరాన్ని పట్టించుకోలేదు
♦ వరంగల్‌లోనూ ‘గ్రేటర్’ ఫలితాలే
 
 సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రజలు మెచ్చే పాలన సాగించిన కాకతీయుల గొప్పదనాన్ని, వారసత్వ సంపదను తిరిగి తెచ్చి వరంగల్ ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. 65 ఏళ్లు  పాలించిన కాంగ్రెస్, టీడీపీలు వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. 18 నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ జిల్లా అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు సీఎం ప్రణాళిక రూపొందించారన్నారు.

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, గిరిజన యూనివర్సిటీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్, కాళోజీ కళా కేంద్రం, పోలీస్ కమిషనరేట్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వరంగల్‌లో ఐటీ రంగం విస్తరణ మొదలుపెట్టామని, దేశంలో అత్యున్నతమైన టెక్స్‌టైల్ పార్కును ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తున్నామని, 10 ఎకరాల్లో అత్యాధునిక పండ్ల మార్కెట్‌ను వరంగల్‌కు మంజూరు చేశామని పేర్కొన్నారు. ముస్లింలకు షాదీఖానా, క్రిస్టియన్‌లకు చ ర్చిల నిర్మాణం కోసం నిధులు కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని చెప్పారు.

‘‘వరంగల్ నగర అభివృద్ధికి బడ్జెట్‌లో ఏటా రూ.300 కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారు. వరంగల్‌లో పేదల కోసం 15 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ తర్వాత ఎక్కువ ఇళ్లు మంజూరు చేసింది ఇక్కడే. ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్న ప్రజలు అన్ని ఎన్నికల్లోనూ మాకు మద్దతిస్తున్నారు’’ అని హరీశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సంపూర్ణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలే గ్రేటర్ వరంగల్‌లోనూ పునరావృతం కాబోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీకి మనుగడ లేదని, కాంగ్రెస్ కనుమరుగయ్యే దయనీయస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. వరంగల్ జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రైల్వే కోచ్, వ్యాగన్ ఫ్యాక్టరీల ఏర్పాటును పట్టించుకోలేదని విమర్శించారు. వరంగల్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. వరంగల్ నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలని కోరారు.

మరిన్ని వార్తలు