'మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటే ఖబడ్దార్'

17 Jun, 2016 15:50 IST|Sakshi

బాల్కొండ (నిజామాబాద్) : మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పోటాపోటీగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ నెలరోజులుగా ఏటిగడ్డ కిష్టాపూర్లో దీక్షలు చేస్తుండగా.. మరోవైపు ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి ఆత్మహత్యలు అరికట్టాలంటూ దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు.

ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ ఎమ్మెల్యే గోవర్థన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ ధర్నాచౌక్లో  టీఆర్ఎస్ నిరసన తెలిపింది. ప్రతిపక్షాల దిష్టిబొమ్మను తగులబెట్టడంతోపాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే మోర్తాడ్లో వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లన్న సాగర్ను నిర్మించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

కాగా మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటే ఖబడ్దార్ అంటూ మంత్రి హరీష్‌రావు ప్రతిపక్షాలను హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బస్వాపూర్‌లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాలుగు గ్రామాల ప్రజల కోసం రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు