ఇక నేనెందుకు?

31 Jul, 2016 01:14 IST|Sakshi
  •  నగరపాలనలో మంత్రి పెత్తనంపై మేయర్‌ అసహనం
  • సాక్షి ప్రతినిధి నెల్లూరు :
    ‘కార్పొరేషన్‌లో పరిపాలన మొత్తం మీ చేతుల్లోకి తీసుకుంటే నేనుండటమెందుకు.. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. రాజీనామా చేసేస్తా.. ’ అని మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణతో తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతకాలంగా మంత్రి నారాయణతో మేయర్‌ అజీజ్‌కు ఏర్పడిన అభిప్రాయ భేదాలు, అంతర్గత గొడవలుగా మారాయి. ఒకరి వ్యవహార తీరుపై మరొకరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు జరిగిన అనంతరం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న గొడవలు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహించారు. సొంత జిల్లాలోనే కార్పొరేషన్‌ను సక్రమంగా నడిపించలేకపోతే రాష్ట్రం మొత్తాన్ని ఎలా నడిపిస్తారని మంత్రి నారాయణ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్‌ పనితీరు పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నారాయణ దీన్ని అవకాశంగా తీసుకొని కార్పొరేషన్‌ మీద తన పట్టు పెంచుకోవడానికి పావులు కదిపారు. మేయర్‌ అజీజ్‌ను డమ్మీ చేస్తూ కార్పొరేషన్‌లో జరిగే ప్రతి వ్యవహారం తనకు తెలియాలని, తనతో సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కమిషనర్‌తో పాటు ఇతర అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మేయర్‌ను ఏమాత్రం లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత కోసం మంత్రి నారాయణ మేయర్‌కు తెలియకుండానే ప్రత్యేక బృందాలను పంపారు. మేయర్‌కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆ బృందాలు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు దిగడంతో పెద్ద దుమారం రేపింది. మేయర్‌ చేతకానితనంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా విమర్శలు చేశారు. పరిపాలన వ్యవహారంలో భాగంగా కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లను లాటరీ పద్ధతిలో ఇటీవల బదిలీ చేశారు. సుదీర్ఘకాలం ఒకేచోట ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం అధికారపార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు మింగుడు పడలేదు. తన సోదరుడు మాల్యాద్రిని బదిలీ చేయడం టీడీపీ కార్పొరేటర్‌ కిన్నెర ప్రసాద్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ బదిలీ ఆపాలని మేయర్‌ మీద ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేకపోయింది. దీంతో తన రాజకీయ గురువు ఆనం వివేకానందరెడ్డి ద్వారా మంత్రి నారాయణ మీద ఒత్తిడి తెచ్చి ఆయనను తిరిగి పాత స్థానానికే బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేయడం అజీజ్‌కు ఆగ్రహం తెప్పించింది. అలాగే టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురిని తనకు తెలియకుండా సస్పెండ్‌ చేయడం అజీజ్‌ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ సస్పెన్షన్‌లు ఆపివేయాలని కొత్తగా వచ్చిన వారిని వదిలేసి పాతవారిని మాత్రమే సాగనంపుదామని మేయర్‌ మంత్రి నారాయణ మీద తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా ఉపయోగం లేకపోయింది. ఈ వ్యవహారాలన్నింటిపై ఆందోళనతో ఉన్న అజీజ్‌ శనివారం సాయంత్రం మంత్రి నారాయణకు ఫోన్‌ చేశారు. కార్పొరేషన్‌ వ్యవహారాలన్నీ తనకు తెలియకుండా జరిగిపోతుంటే తానెందుకు పదవిలో ఉండాలని అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. నెల్లూరు కార్పొరేషన్‌ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని మంత్రి మేయర్‌ అజీజ్‌కు తెగేసి చెప్పారని తెలిసింది. ఈ వ్యవహారం నడుస్తుండగానే టీడీపీ నగర ఇన్‌చార్జ్‌ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బదిలీ గురించి మేయర్‌కు ఫోన్‌ చేశారు. కార్పొరేషన్‌లో అన్నీ తనకు తెలిసే జరుగుతున్నాయా.. మంత్రిని అడిగి బదిలీ చేయించుకోండని అజీజ్‌ ముంగమూరు మీద కోపం ప్రదర్శించారు. దీంతో శ్రీధరకృష్ణారెడ్డి తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలిసింది. కార్పొరేషన్‌ కార్యాలయం వేదికగా జరిగిన ఈ రాజకీయ పరిణామాలు తెలుగుదేశంపార్టీలోనూ, కార్పొరేషన్‌ ఉద్యోగుల్లోనూ హాట్‌టాపిక్‌గా మారాయి. 
    మంత్రితో విభేదాలు లేవు: మేయర్‌ అజీజ్‌ 
    తనకు మంత్రి నారాయణతో ఎలాంటి విభేదాలు లేవని మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ సాక్షి ప్రతినిధికి చెప్పారు. తాను రాజీనామా చేస్తానని మంత్రికి చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తినంత మాత్రాన విభేదాలున్నట్లుగా పరిగణించకూడదని మేయర్‌ పేర్కొన్నారు. 
మరిన్ని వార్తలు