నా తల్లిదండ్రులు నిర్వాసితులే: మంత్రి కేటీఆర్

23 Jun, 2016 23:49 IST|Sakshi
నా తల్లిదండ్రులు నిర్వాసితులే: మంత్రి కేటీఆర్

- నిర్వాసితుల బాధలు మాకు తెలుసు
- వెయ్యిమందికి నష్టం జరిగినా లక్షల మందికి లబ్ధి
- ప్రాజెక్టులపై ప్రతిపాక్షాల శిఖండి రాజకీయాలు
- తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరిందిస్తాం
- రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్


ఎల్లారెడ్డిపేట (కరీంనగర్ జిల్లా) : 'మా అమ్మనాన్నలు భూములు కోల్పోయిన నిర్వాసితులే... నిర్వాసితుల బాధలు ఎలా ఉంటాయో మా కుటుంబానికి తెలుసు... మాకంటే కష్టాలు అనుభవించిన నిర్వాసితులు ఉండకపోవచ్చు... నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం పోసానిపల్లెలో మా తండ్రి కేసీఆర్ ఎగువ మానేరు ప్రాజెక్టు కింద భూములు కోల్పోతే వచ్చిన పరిహారంతో సిద్ధిపేట మండలం చింతమడకలో భూములు కొని స్థిరపడ్డాం...'  అని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తుందన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీ శిఖండి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఆరోపణలు చేస్తున్న ఏ నాయకుడూ నిర్వాసితుల జాబితాలో లేరన్నారు.

తన తల్లిదండ్రులు నాడు నిర్వాసితులుగా ఎన్నో బాధలు అనుభవించారని చెప్పారు. తన తల్లి స్వగ్రామమైన కొదురుపాకలో మిడ్‌మానేరు ప్రాజెక్టులో భూములు కోల్పోయి నిర్వాసితురాలు కాగా.. తండ్రి కేసీఆర్ భూములు ఎగువమానేరు ప్రాజెక్టు కింద పోయాయని తెలిపారు. వచ్చిన కొద్దిపాటి పరిహారంతో కుటుంబంతో సహా చింతమడుకకు వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు. నిర్వాసితుల కష్టాలు ఎలా ఉంటాయో తమకంటే ఎక్కువ ఇంకెవరికీ తెలియదన్నారు.

భూములు పోవడం వల్ల వెయ్యిమందికి నష్టం జరిగితే ప్రాజెక్టుల నిర్మాణాలతో లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతుందన్నారు. సాగునీరు, ఇంటింటికి నల్లానీటిని అందించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణకు నీళ్ల పంపకంలో ద్రోహం చే సే విధంగా చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తుంటే నోరు మెదపని ప్రతిపక్షాలు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నట్లుగా రైతులను రెచ్చగొడుతూ తమ ప్రభుత్వంపై నిందలేయడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో చేపట్టిన ఎస్సారెస్పీ కాలువ నిర్మాణ పనులు నలభై ఏళ్లుగా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే కృష్ణా, గోదావరి జలాలపై పోరాటం చేయాలని హితవు పలికారు. సమావేశంలో కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు