ఓ లుక్కేద్దాం

9 Feb, 2017 22:41 IST|Sakshi
ఓ లుక్కేద్దాం

– టీడీపీ నేత షకిల్‌షఫీ కుటుంబసభ్యుల నుంచి 204.03 ఎకరాల కొనుగోలు
– ప్రతిఫలంగా నగదుతో పాటు షకిల్‌షఫీ తండ్రికి వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గిరి కట్టబెట్టే వ్యూహం
– ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మద్దతూ కూడగట్టిన వైనం
– ‘పల్లె’ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
–  టీడీపీలో చిచ్చురేపుతోన్న వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఎంపిక వ్యవహారం


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
    వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవి విషయమై టీడీపీలో చిచ్చురేగుతోంది. తన అస్మదీయుణ్ని చైర్మన్‌ చేయాలని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రతిపాదిస్తున్నారు. దీన్ని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మినహా తక్కిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం జిల్లా టీడీపీలో  తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీలోని కీలక వర్గాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

        అనంతపురం రూరల్‌ పరిధిలోని ఆలమూరు సమీపంలో  (నగరానికి అతి దగ్గరగా..)  204.03 ఎకరాల భూమిని మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొనుగోలు చేశారు. ఇందులో 117.04 ఎకరాలను గత ఏడాది జూలై 25న, మరో 86.99 ఎకరాలను అక్టోబరు 26న కొన్నారు. మొత్తం భూములను బాలాజీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ తరఫున, దాని ప్రస్తుత అధ్యక్షుడు పల్లె రఘునాథరెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ భూములను అనంతపురానికి చెందిన టీడీపీ నేతలు కేఎం షఫీవుల్లా, కేఎం షకిల్‌షఫీ, వారి కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నారు. ఇక్కడ ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.15–20 లక్షల వరకు ధర పలుకుతోంది. మంత్రి మాత్రం రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఎకరానికి రూ.1.50 లక్షలు చెల్లించారు. తక్కిన మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే రిజిస్ట్రేషన్‌లో రూ.3.6 కోట్లు అధికారికంగా చూపించి, అనధికారికంగా  రూ.27–30 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

పదవి కోసం ఒప్పందం!
భూ లావాదేవీల సమయంలో షఫీవుల్లాకు, మంత్రి పల్లెకు మధ్య ఓ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. భూములు ఇస్తున్నందున ప్రతిఫలంగా తనకు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవి దక్కేలా చూడాలని షఫీవుల్లా కోరినట్లు సమాచారం. అయితే.. తాను మైనార్టీశాఖ మంత్రి అయినప్పటికీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఎంపిక ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుందని, దీనిపై తాను హామీ ఇవ్వలేనని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రికి మరో బాధ్యతను అప్పగించారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌  ఎంపిక ప్రక్రియలో మొదటగా 11మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఒక డైరెక్టర్‌ను చైర్మన్‌ చేస్తారు. ముతవల్లిల కోటాలో ఒకరిని డైరెక్టర్‌గా నామినేట్‌ చేసే అవకాశముంది.

తనను నామినేట్‌ చేసే బాధ్యతను పల్లెకు అప్పగించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ అయిన తర్వాత చైర్మన్‌ కోసం మరో ప్రయత్నం చేయొచ్చనేది షఫీవుల్లా ఆలోచనగా ఉంది. టీడీపీలో మైనార్టీలెవరూ ఎమ్మెల్యేలుగా విజయం సాధించలేదు. అరువొచ్చిన జలీల్‌ఖాన్, చాంద్‌బాషా కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న లాబీతో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గిరి దక్కించుకోవాలని షఫీవుల్లా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు చేజారితే మరెప్పుడూ దక్కదనే ఆలోచనతో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  షఫీవుల్లా తెలంగాణ ఏసీబీ డీజీ ఏకేఖాన్‌కు స్వయాన మామ. ఆయన  కుమారైను ఏకేఖాన్‌ వివాహం చేసుకున్నారు.

టీడీపీలో ధిక్కార స్వరం
ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ముఖ్య నేతల వద్ద పల్లె ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదనను అనంతపురం ఎమ్మెల్యే మినహా జిల్లా టీడీపీలోని దాదాపు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించినట్లు సమాచారం. షఫీవుల్లా కుటుంబం టీడీపీని అడ్డుపెట్టుకుని లబ్ధిపొందడం మినహా పార్టీకి వారు చేసేందేమీ లేదని, అయినప్పటికీ షఫీవుల్లా కుమారుడు షకిల్‌షఫీని శాప్‌ డైరెక్టర్‌ చేశామని, తిరిగి అదే కుటుంబానికి వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవి కట్టబెట్టాలని ప్రతిపాదన తేవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దీంతో పల్లె ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కేబినెట్‌ విస్తరణతో పాటు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఎంపిక కూడా చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.  కేబినెట్‌ విస్తరణలో పల్లె పోస్టు ఉంటుందా, ఊడుతుందా అనే అంశంపై స్పష్టత లేదని, ఈ క్రమంలో తన పోస్టును కాపాడుకుంటే చాలని, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఎంపికలో తలదూర్చడం ఏంటని ఇద్దరు ఎమ్మెల్యేలు పల్లెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు