ఎమ్మెల్యేకు మంత్రి పీతల ఝలక్

22 Feb, 2016 11:51 IST|Sakshi
ఎమ్మెల్యేకు మంత్రి పీతల ఝలక్
 డ్రెయిన్ గట్టు తవ్వకాన్ని అడ్డుకున్న పీతల సుజాత
 మంత్రిపై మండిపడుతున్న భీమవరం ఎమ్మెల్యే  
 
భీమవరం : భీమవరంలో ఇళ్లస్థలాల పూడిక వ్యవహరంలో అడ్డగోలుగా తవ్వుతున్న గొంతేరు డ్రెయిన్ గట్టు తవ్వకానికి మంత్రి పీతల సుజాత అడ్డుకట్ట వేశారు. దీంతో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తలకు బొప్పికట్టింది. ఈనెల 17న ‘గట్టు కీడు తలపెట్టెనోయ్’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి మంత్రి సుజాత స్పందించారు. దీంతో డ్రెయిన్ గట్టు తవ్వకం పనులను తక్షణం నిలిపివేయాలంటూ జలవనరుల శాఖ అధికారులకు ఆదివారం మౌఖిక దేశాలు ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. భీమవరం పట్టణంలో పేదలకు ఇళ్లు నిర్మించడానికి గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో 82 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
 
అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన పులపర్తి రామాంజనేయులు ఏడేళ్ల అనంతరం ఆ భూమి పూడికతో పాటు భీమవరం మండలం గొల్లవానితిప్పలో సేకరించిన మరో 16 ఎకరాల భూమి పూడిక పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పూడికకు సీఏడీ భూముల్లో అక్రమంగా తవ్వుతున్న చెరువుల్లోని మట్టి, యనమదుర్రు, గొంతేరు డ్రెయిన్ గట్ల మట్టిని తవ్వి తర లిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో డ్రెయిన్లలో పూడిక తీసి ఆ మట్టిని గట్లుపై వేశారు. అయితే ప్రస్తుతం ఇళ్లస్థలాల పూడికకు డ్రెయిన్ల గట్ల మట్టిని తవ్వడం వల్ల భవిష్యత్తులో గట్లు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. రైతులు, సమీప ఇళ్లకు వరద ముప్పు పొంచి ఉండే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రెయిన్స్‌లో గుర్రపుడెక్క, తూడు కుళ్లిన మట్టితో స్థలాలను పూడ్చడం వల్ల పునాధి ఏ మేరకు పటిష్టంగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. స్థానికుల గోడును ‘సాక్షి’ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చింది. ఇదే తరుణంలో వీరవాసరం మండలంలోని డ్రెయిన్  మట్టి తరలింపును, సమస్యను అక్కడి ప్రజలు రాష్ట్రమంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి సొంత మండలం కావడంతో వెంటనే స్పందించి డ్రెయిన్ గట్ల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.
 
ఈ విషయం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు దృష్టికి వెళ్లడంతో మంత్రి జోక్యంపై  తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్లస్థలాల పూడిక చేపడితే అభివృద్ధిని స్వయంగా మంత్రే అడ్డుకుంటున్నారని మండిపడినట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి సొంత మండలమైన వీరవాసరంలో సుజాతకు ఎటువంటి విషయాలు తెలియచేయకుండా ఎమ్మెల్యే వ్యవహారాలు చేస్తున్నారని, గతంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలున్న సమయంలో డ్రెయిన్ల గట్టు తవ్వకం తాజాగా కొత్త వివాదానికి దారితీసిందని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
మరిన్ని వార్తలు