ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి తీరుతాం

20 Oct, 2016 21:48 IST|Sakshi
ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి తీరుతాం

– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం పుల్లారావుతో పాటు మంత్రి పల్లె రఘనాథరెడ్డి  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.90 లక్షలతో గోదాము, రూ.50 లక్షలతో రైపనింగ్‌ చాంబర్, కేవీకే సమీపంలో రూ.60 లక్షలతో నిర్మించిన  రైతు శిక్షణ కేంద్రంæప్రారంభోత్సవానికి హాజరయారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి మట్లాడుతూ అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాగా అనంతపురం ఉందన్నారు. ఈ జిల్లాపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు.

పంట నష్టపోయిన రైతులకు రెయిన్‌గన్ల పేరుతో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. రెయిన్‌గన్లు ఆలస్యంగా ఏర్పాటు చేయడానికి వైఎస్సార్‌సీపీనే కారణమని ఆరోపించారు. రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. గతేడాది కూడా జిల్లాకు రూ.547 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వాలనేదే సీఎం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే నదుల అనుసంధానం చేస్తున్నామన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కుటుంబం ఆస్తులను ప్రకటించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, వైఎస్‌ జగన్‌ కూడా కుటుంబ ఆస్తులు ప్రకటించాలని అన్నారు.

మరిన్ని వార్తలు