కూలిన లిఫ్ట్.. తలసానికి తప్పిన ప్రమాదం

8 Dec, 2015 03:31 IST|Sakshi
కూలిన లిఫ్ట్.. తలసానికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ లిఫ్ట్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో సోమవారం లిఫ్ట్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా వైరు తెగి మొదటి అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడింది. ఈ ఘటనలో మంత్రితో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

 

సనత్‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఖలీల్‌బేగ్ తండ్రి మీర్జా అమానుల్లాబేగ్ సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయనను పరామర్శించేందుకు మంత్రి తలసాని ఆస్పత్రికి వచ్చారు. అమానుల్లాబేగ్ వద్దకు వెళ్లేందుకు మొదటి అంతస్తులో లిఫ్ట్ ఎక్కారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, నాయకులు సురేశ్‌గౌడ్, ఖలీల్‌బేగ్‌లతో పాటు 15 మంది వరకు ఉన్నారు. భారంగా పైకి కదిలిన లిఫ్ట్ క్షణాల్లోనే వైర్ తెగి గ్రౌండ్‌ఫ్లోర్ (సెల్లార్)లో పడింది. అప్రమత్తమైన అక్కడి సిబ్బంది సెల్లార్‌కు చేరుకుని లిఫ్ట్‌లో ఉన్న మంత్రి, ఇతరులను బయటకు తీశారు.

ఈ ఘటనలో మంత్రి కాలు బెనకడంతో పాటు చేతికి స్వల్ప గాయం కావడంతో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాజీ కార్పొరేటర్ శేషుకుమారి కాలు ఫ్రాక్చర్ కాగా మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా సమయంలో లిఫ్ట్ నిర్వహణ చూసుకునే సిబ్బంది లేకపోవడం, లిఫ్ట్ కెపాసిటీని తెలియజేస్తూ సూచనలు ఏమీ చేయకపోవడం, లిఫ్ట్ వైర్ కూడా పాతది కావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మంత్రి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు