రోడ్లపై మంత్రులు..

19 Jul, 2015 00:54 IST|Sakshi
ధర్మపురి సమీపంలో పాడైపోయిన ఓ కారును నెడుతున్న హరీశ్ రావు

సాక్షి నెట్‌వర్క్: పుష్కరాలకు భారీగా జనం రావడంతో కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుల్లెట్ బైక్‌లపై అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇక్కడి ధర్మారం నుంచి వెల్గటూర్ మండలం రాజారాంపల్లి వరకు బైక్‌లపై వెళుతూ.. ఆగి ఉన్న వాహనాలను క్లియర్ చేశారు.

తర్వాత ధర్మపురి వరకు రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇక భద్రాచలంలో ట్రాఫిక్ అంతరాయాన్ని సరిదిద్దేందుకు మంత్రులు తుమ్మల, జగదీశ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం రాత్రి వారు భద్రాచలంలోని ప్రధాన రహదారిపై తిరుగుతూ అధికారులకు సూచనలు చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా పాల్వంచ శివారులో వేలాది వాహనాలు నిలిచిపోవడంతో డీజీపీ అనురాగ్‌శర్మ హెలికాప్టర్ ద్వారా పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు.

పుష్కర స్నానం చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె భూమా అఖిలప్రియారెడ్డి కరీంనగర్ జిల్లా మహదేవపూర్ సమీపంలో గోదావరి పుష్కర స్నానం చేశారు. వారు కాళేశ్వరం వెళ్లాల్సి ఉన్నా.. తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం కారణంగా మహదేవపూర్ సమీపంలో పుష్కరస్నానం ఆచరించారు.
 
భద్రాచలంలో ఎక్కడ చూసినా జనజాతరే. శనివారం ఇక్కడ పుష్కర స్నానాలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. ఇది భద్రాచలంలో రికార్డు.భారీ సంఖ్యలో వస్తున్న వాహనాలన్నీ టోల్‌గేట్ల వద్ద నిలిచిపోవాల్సి రావడంతో.. పలు చోట్ల టోల్ వసూలు చేయకుండానే వదిలివేశారు. వాహనాలు తగ్గినప్పుడు ఆపి టోల్ వసూలు చేస్తూ, వాటి సంఖ్య పెరగగానే వదిలివేశారు.
 

>
మరిన్ని వార్తలు