మంత్రి మాటలు.. ‘నీటి’మూటలు

29 May, 2017 23:00 IST|Sakshi
మంత్రి మాటలు.. ‘నీటి’మూటలు
  • బోర్లలో నీరు రాక ఎండుతున్న ఉద్యాన పంటలు
  • రూ.వందల కోట్ల నష్టం
  • అన్ని పంటలను కాపాడతామని మంత్రి సోమిరెడ్డి హామీ
  • చీనీ, మామిడికి మాత్రమే మొక్కుబడిగా రక్షకతడులు
  • మిగతా వాటిని పట్టిం‍చుకోని వైనం 
  • అనంతపురం అగ్రికల్చర్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా అన్ని రకాల పండ్లతోటలను కాపాడతామని మంత్రి హామీ ఇవ్వగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న జిల్లా పర్యటనకు వచ్చిన సోమిరెడ్డి అనంతపురం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, బుక్కపట్నం తదితర మండలాల్లో బోరుబావుల్లో నీళ్లు రాక ఎండుముఖం పట్టిన చీనీ, మామిడి, ద్రాక్ష తదితర పండ్లతోటలను పరిశీలించారు. ఎంత ఖర్చయినా వెనకాడేది లేదు.. రక్షకతడులు ఇచ్చి తోటలన్నీ కాపాడతామని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లా పర్యటన ముగించుకుని అమరావతి వెళ్లగానే ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. చీనీ, మామిడి తోటలకు మాత్రమే రక్షకతడి ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. అవి కూడా మండు వేసవి ముగిసే సమయంలో ఇవ్వడంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

     

    ఎత్తిపెట్టిన బోర్లు.. ఎండిన తోటలు

     జూలై, 2016 తర్వాత జిల్లాలో సరైన వర్షం పడకపోవడంతో భూగర్భజలాలు సగటున 26 మీటర్ల లోతుకు పడిపోయాయి. బోర్ల నుంచి గుక్కెడు నీరు రావడం గగనంగా మారింది. జిల్లాలో దాదాపు 2.50 లక్షల బోరుబావులు ఉండగా, 90 వేల వరకు ఎత్తిపోయినట్లు అంచనా. రూ.లక్షలు వెచ్చించి పెంచిన పండ్లతోటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అప్పులు చేసి కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. భగీరథ ప్రయత్నమే చేస్తున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పది ఎకరాల  తోటలున్న రైతులు ఐదు ఎకరాలు వదిలేసి..మిగిలిన తోటను కాపాడుకునే యత్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు ట్యాంకర్లను కొనుగోలు చేసి అరకొరగా నీటిని సరఫరా చేసుకుంటున్నారు. విపత్తు సంభవిస్తుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానశాఖ ముందస్తు చర్యలు చేపట్టడంలో దారుణంగా విఫలమయ్యాయి. ఫలితంగా రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఒక అంచనా ప్రకారం నీటి ఎద్దడితో పాటు ధరలు లేక ఈ సీజన్‌లో చీనీ, మామిడి, దానిమ్మ, అరటి, బొప్పాయి, కర్బూజా, కళింగర తదితర రైతులకు రూ.800 కోట్ల వరకు నష్టం జరిగింది.

     

    ఎటు చూసినా క్షామమే..

    జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో 1.71 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పండ్లతోటలు ఉన్నాయి. అత్యధికంగా చీనీ 45 వేల హెక్టార్లు, మామిడి 44 వేల హెక్టార్లు, అరటి 12 వేల హెక్టార్లు, దానిమ్మ 7 వేల హెక్టార్లు, సపోటా 5 వేల హెక్టార్లు, కర్భూజా, కళింగర పంటలు 10 వేల హెక్టార్లు, ఇవి కాకుండా ద్రాక్ష, జామ, అంజూర, బొప్పాయి, కూరగాయలు, పూలు, ఔషధ పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. భూగర్భజలాలు అటుగంటిపోవడంతో తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, కూడేరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ముదిగుబ్బ, అనంతపురం, పుట్లూరు, యల్లనూరు, గార్లదిన్నె, నార్పల, కనగానపల్లి, బత్తలపల్లి, తాడిమర్రి, బుక్కపట్నం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, రాయదుర్గం, పామిడి, పెద్దపప్పూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో  దాదాపు 15 నుంచి 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లతోటలు ఎండిపోయాయి. ఏళ్ల తరబడి పెంచిన దానిమ్మ, ద్రాక్ష, అంజూర లాంటి తోటలు ఎండిపోవడంతో రైతుల ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది.

    మొక్కుబడిగా రక్షకతడి

     15 వేల ఎకరాల చీనీ, 5 వేల ఎకరాల మామిడికి రక్షకతడి ఇవ్వడానికి రూ.32 కోట్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కూడా అస్తవ్యస్తంగా తయారు కావడంతో రాయితీ సొమ్ము వస్తుందా, రాదా అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యానశాఖ అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో రక్షకతడి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటివరకు 1,600 హెక్టార్ల చీనీ, 1,200 హెక్టార్ల మామిడి తోటలకు మాత్రమే ఒక రక్షకతడి ఇచ్చినట్లు సమాచారం. రైతులే స్వయంగా నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాలని మెలికపెట్టడంతో అందుబాటులో ట్యాంకర్లు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల పండ్లతోటలకు రక్షకతడి ఇవ్వాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు తాము కూడా ప్రభుత్వానికి,  కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు