మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీకి అవమానం

12 Nov, 2016 02:11 IST|Sakshi
మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీకి అవమానం
నెల్లూరు(సెంట్రల్‌): సాక్షాత్తూ మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ షంషుద్దీన్‌కు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ సమక్షంలో అవమానం జరిగింది. ఈడీ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమంలో టీడీపీ చోటా నేతలను కూర్చోబెట్టి ఈడీని కింద కూర్చోమనడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురుయ్యారు. వివరాలు.. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి, అదే విధంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని అంబేద్కర్‌ భవన్‌లో ఈడీ షంషుద్దీన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్, జాయింట్‌ కలెక్టర్‌ – 2 సాల్మన్‌ రాజ్‌కుమార్, మేయర్‌ అజీజ్‌ హాజరయ్యారు. ముందు జేసీలిద్దరూ, మేయర్‌ స్టేజీ మీద కూర్చున్న తర్వాత ఈడీ వెళ్లగా అజీజ్‌ మనుషులు, చోటా టీడీపీ నాయకులు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఈడీని కింద కూర్చోమనే విధంగా మేయర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఈడీ కూర్చోవాల్సిన స్థానంలో టీడీపీ చోటా నాయకులు కూర్చున్నారు. దీంతో ఈడీ తీవ్ర మనస్తాపంతో వేదిక ముందు అందరి మధ్యలోనే కూర్చోవాల్సి వచ్చింది. అదే విధంగా కార్యక్రమానికి అధికారికంగా వచ్చిన జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ హుస్సేన్, డిప్యూటీ డీఈఓ షా మహ్మద్‌ కూడా స్టేజీ మీద చోటు లేకపోవడంతో వేదిక ముందే కూర్చోవాల్సి వచ్చింది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులను అవమానించిన మేయర్‌ తీరును పలువురు విమర్శించారు. 
 
 
మరిన్ని వార్తలు