నెల్లూరు కోటపై మైనారిటీల కన్ను

22 Jun, 2016 02:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని గట్టిగానే ఢీ కొని నెల్లూరు నగరంలో తమ పట్టు పెంచుకోవాలని మైనారిటీ నేతలు నిర్ణయించారు. మేయర్ అబ్దుల్ అజీజ్‌పై అవినీతి ఆరోపణలు చేసినందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో లక్ష సంతకాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. మైనారిటీల బృందం త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి వివేకా మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.  ఇదే సమయంలో నగరంలో తమ పరపతి పెంచుకుని వచ్చే ఎన్నికల నాటికి టికెట్ డిమాండ్ చేసే శక్తిగా ఎదగాలని నిర్ణయించారు.
 
అధికార పార్టీ మేయర్‌గా నగరంలో తన పరపతి పెంచుకుని వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి బలంగా తయారు కావాలని మేయర్ అజీజ్ ఆశ పడుతున్నారు. తనకు స్వతహాగా అంత శక్తి లేకపోవడంతో మైనారిటీ ప్రతినిధిగా ఈ పనిచేయాలనే దిశగా కొంత కాలం నుంచి మెల్లగా అడుగులు వేస్తున్నారు. ఆనం కుటుంబం టీడీపీలో చేరడంతో తన కోరిక నెరవేర్చుకోవడం కష్టమనే భావనతో పార్టీలో ఆనం వ్యతిరేక వర్గీయులను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు.

ఇందులో భాగంగానే నెల్లూరు నగర టీడీపీ బాధ్యతలు ఎలాంటి పరిస్థితుల్లో వివేకా కుటుంబానికి దక్కకుండా అడ్డుకునే ఏకైక అజెండాతో అజీజ్ టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చాలా దగ్గరయ్యారు. తెర చాటుగా జరుగుతున్న ఈ రాజకీయ సమీకరణలు గ్రహించిన ఆనం వివేకా అదను చూసి అజీజ్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఎదురు చూశారు.

కార్పొరేషన్‌లో ఏసీబీ దాడుల నేపథ్యంలో అజీజ్‌పై రాజకీయ దాడి ప్రారంభించారు. అజీజ్‌కు పాలన చేత కాదనీ, విషయ పరిజ్ఞానం లేదనే అంశాన్ని జనంలోకి, పార్టీ పెద్దల్లోకి చొప్పించే వ్యూహంతో విమర్శల అస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారంపై అజీజ్ ప్రతి విమర్శలకు దిగకుండా పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తారని అంచనా వేశారు. అయితే ఊహించని విధంగా అజీజ్ ఈ వివాదానికి విజయవంతంగా ముస్లిం మైనారిటీ రంగు పూయగలిగారు.
 
మైనారిటీ పెద్దలతో రహస్య సమావేశం
ఆనం కుటుంబం తన మీద నేరుగా రాజకీయ దాడి ప్రారంభించిన నేపథ్యంలో అజీజ్ తనకు మద్దతునిచ్చే ముస్లిం మైనారిటీ పెద్దలతో  రెండు రోజులుగా రహస్య సమావేశాలు నిర్వహించారు. నెల్లూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క సారి కూడా మైనారిటీ ఎమ్మెల్యే లేరనీ, వచ్చే ఎన్నికల నాటికి తామంతా ఐక్యంగా ఉండి బలంగా తయారైతే ఆ అవకాశం ఎవరో ఒకరికి వస్తుందని వీరంతా అంచనా వేసినట్లు సమాచారం.

ఇదే సమయంలో వివేకా మీద తీవ్ర స్థాయిలోనే స్పందించాలని నిర్ణయించారు. వివేకా మతాన్ని కించపరచారనే కోణంలోనే ఆయన్ను ఫిక్స్ చేయాలనే వ్యూహం రూపొందించారు. ఇందులో భాగంగానే మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరంతా ఈ అంశం మీదే విరుచుకుపడ్డారు. మైనారిటీల దయతోనే వివేకా ఎమ్మెల్యే అయ్యారనే వాదన లేవదీశారు. లక్ష మందితో సంతకాలు సేకరించి వివేకా మీద సీఎం చంద్రబాబుకు ఇదే విషయాన్ని ఫిర్యాదు చేయాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది.

మరిన్ని వార్తలు