మద్యం మత్తులో తుపాకీ పేలుడు

5 Nov, 2016 00:13 IST|Sakshi
మద్యం మత్తులో తుపాకీ పేలుడు
  •  ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ కలకలం
  • నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం తుపాకి పేలింది. ప్రిజనర్స్‌ వార్డ్‌ గార్డ్‌ డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ మద్యం మత్తే ఇందుకు కారణమని తెలుస్తోంది. తూటా గోడకు తగలడంతో ప్రమాదం తప్పింది. పోలీసుల సమాచారం మేరకు.. జి.అనిల్‌ నెల్లూరు ఏఆర్‌ విభాగంలో కానిస్టేబుల్‌. ఆయన కొద్దిరోజులుగా డీఎస్‌ఆర్‌ ప్రభుత్వాస్పత్రిలో  ప్రిజనర్స్‌(ఖైదీలు)వార్డ్‌ గార్డ్‌ డ్యూటీ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం డ్యూటీకి వచ్చారు. అయితే అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉండటంతో వార్డ్‌ వద్ద హల్‌చల్‌ చేశారు. సాయంత్రం ఐదుగంటల  ప్రాంతంలో తన వద్ద నున్న 303 రైఫిల్‌ని చేతులతో తిప్పసాగాడు. ఈవిషయాన్ని గమనించిన తోటి సిబ్బంది అతడిని వారించారు. అయినా అతను పెడచెవిన పెట్టి తిప్పుతూ ఉన్న సమయంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఏం జరిగిందోనని సమీప వార్డులోని రోగులు, సహచర సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. రోగులు బయటకు పరుగులు తీశారు.  సహచర సిబ్బంది ఏం జరిగిందోనని పరిశీలించగా అనిల్‌ చేతిలో ఉన్న తుపాకి పేలి అందులోని తూటా ఎదురుగా ఉన్న గోడను తగిలి కిందపడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అనిల్‌ చేతిలో ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం జరిగిన విషయాన్ని  ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆర్‌ఐ కె.శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనిల్‌ మద్యం మత్తులో ఉండటంతో ట్రాఫిక్‌ సిబ్బంది ద్వారా బ్రీత్‌ఎన్‌లైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్‌ అనిల్‌ అధిక మొత్తంలో మద్యం సేవించి ఉండటాన్ని గుర్తించి వైద్యపరీక్షల నిమిత్తం అతడిని ఎమెర్జెన్సీ వార్డుకు పంపారు. తూటాను, తుపాకీని స్వాధీనం చేసుకొన్నారు. తుపాకీ పేలుడు ఘటనపై  విచారణ జరుగుతోందని, నివేదికను ఎస్పీకి అందజేయనున్నట్లు ఆర్‌ఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. తుపాకీ గోడకు తగలడంతో ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు. 
     
     
మరిన్ని వార్తలు