తల్లి వద్దకు చేరిన కుమారుడు

9 Apr, 2017 14:53 IST|Sakshi
తల్లి వద్దకు చేరిన కుమారుడు

గిద్దలూరు : పట్టణంలోని పాములపల్లె రోడ్డులో ఉంటున్న దార్ల నిర్మలాదేవి కుమారుడు శివశక్తికుమార్‌ ఎట్టకేలకు తల్లి వద్దకు చేరాడు. ‘అందరు ఉన్నా అనాథ!’ శీర్షికతో ఈ నెల 3వ తేదీన ‘సాక్షి’లో ప్రచురించిన కథనాన్ని చదివిన నిర్మలాదేవి కుమారుడు శివశక్తికుమార్‌ శుక్రవారం ఇంటికి చేరాడు. తన తల్లి అనారోగ్యంతో పడుతున్న కష్టాలు పత్రిక ద్వారా తెలుసుకుని తల్లి చెంతకు చేరాడు. భార్య, ఇద్దరు కుమారులతో వచ్చి రెండు రోజులుగా తల్లి ఆలనాపాలన చూసుకుంటున్నాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తల్లికి స్థానికంగా వైద్యం చేయిస్తున్నాడు. కన్న కుమారుడు ఏడేళ్ల తర్వాత తిరిగి ఇంటికి రావడంతో ఆ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తన కుమారుడిని దగ్గరకు చేర్చేందుకు ‘సాక్షి’ చేసిన కృషిని నిర్మాలాదేవి, ఆమె బంధువులు అభినందించారు.

దాతలు సహకరించాలని విజ్ఞప్తి: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తల్లికి వైద్యం అందించి మామూలు మనిషిని చేసుకోవాలని కుమారుడు శివశక్తి కుమార్‌ ఆరాటపడుతున్నాడు. నెల్లూరు తీసుకెళ్లి పూర్తిస్థాయి వైద్యం చేయించేందుకు తన వద్ద డబ్బులు లేవని, అప్పు ఇవ్వాలని బంధువులను కోరుతున్నాడు. బంధువులు వాయిదాలు వేస్తుండటంతో చేసేది లేక తల్లికి సపర్యలు చేస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాక శివిశక్తికుమార్‌ తిరుపతిలో ఉంటూ అక్కడే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం నెల్లూరులో ఓ కాంట్రాక్టర్‌ వద్ద దినసరి కూలీగా పనిచేస్తూ భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇంతలో తల్లికి అనారోగ్యంగా ఉందని తెలుసుకుని ఉండలేక ఉన్నఫళంగా వచ్చేశాడు. తల్లి వైద్యానికి అవసరమైన డబ్బు కోసం శివశక్తికుమార్‌ ఉన్న దారులన్నీ వెతుకుతున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ రావడంతో బంధువులు సహకరించడం లేదని తెలుస్తోంది. దాతలు సహకారం అందించి తన తల్లిని కాపాడాలని శివశక్తికుమార్‌ కోరుతున్నాడు. సత్యసాయి సేవా సమితి, గిద్దలూరు జర్నలిస్టులు కొంతమేర ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని శివశక్తికుమార్‌ కోరుతున్నాడు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు 99495 97381, 99516 07043 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశాడు.

మరిన్ని వార్తలు