శకలాలు ఏఎన్ 32వేనా?

23 Aug, 2016 14:51 IST|Sakshi

జీఎస్‌ఐ శాస్త్రవేత్తల సాయంతో సాగర్ నిధి పరిశోధన
 గాలింపులో శకలాలు లభ్యం... లేబొరేటరీకి తరలింపు
 
విశాఖపట్నం : నేషనల్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తల సహకారంతో సాగర్ నిధి (ఓషన్ టెక్నాలజీ షిప్) సముద్ర గర్భంలో చేపట్టిన శోధనలో విమాన శకలాలు దొరికాయి. అయితే ఇవి ఇండియన్ ఎయిర్‌ఫోర్సు ఏఎన్ 32వేనా... కాదా అన్నది తేలాల్సి వుంది. ఎన్‌ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భూపేంద్రసింగ్, పాటి నాగేంద్రరావు, ఆర్‌వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి,చరణ్ మహరాణా, ఎన్.చిన్నారావు, గంట్ల శ్రీనివాసరావులతోపాటు 29మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు గత నెల  22న ఉదయం ఎయిర్‌ఫోర్సు విమానంతో గల్లంతయిన నేపథ్యంలో రక్షణ శాఖ గాలింపు జరుపుతున్న సంగతి తెలిసిందే.

షిప్పులు, సబ్‌మెరైన్లు, నేవీ హెలికాప్టర్లు, కోస్టుగార్డు, ఎయిర్‌ఫోర్సు దళాలు ఇందులో పాల్గొన్నాయి. రష్యన్ సెర్చ్ అండ్ రిస్క్యూ షిప్‌ని కూడా రంగంలోకి దించడం తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) శాస్త్రవేత్తల సహకారంతో  సాగర్ నిధి నౌక ఇన్సాల్ కెమెరా ద్వారా శోధించింది. చెన్నైకి 280 నాటికన్ మైళ్ల దూరంలో సంద్రమంతా జల్లెడపడితే కొన్ని విమాన శకలాలు లభించినట్లు తెలిసింది. లభ్యమయిన శకలాలు ఇండియన్ ఎయిర్‌ఫోర్సు విమానం ఏఎన్ 32వేనా... కాదా నిర్ధారించేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లేబొరేటరీకి తరలించినట్లు సమాచారం.
 
ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాల్లో ఉత్కంఠ
సంద్రంలో విమాన శకలాలు లభ్యమయ్యాయన్న సమాచారంతో ఎన్‌ఏడీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన, ఉత్కంఠ పెరిగింది. ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడానికి ఇపుడు అధికారులకు, యూనియన్ నేతలకు అంతుచిక్కడం లేదు. వారు ఏమయ్యారని కుటుంబాలు ప్రశ్నిస్తుంటే.. ఏం చెప్పాలో వారికి తెలీడం లేదు. ఎందరెందరో పెద్దలు వచ్చారు.. వారు తమవారిని కాపాడకపోతారా అన్న అంతులేని ఆశలతో గల్లంతైనవారి కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. శకలాల లభ్యంపై సోమవారం ఎన్‌ఏడీ సీజీఎంతో యూనియన్ నేతలు చర్చించారు.

మరిన్ని వార్తలు