‘భగీరథ’లో వేగం

17 Jun, 2016 02:09 IST|Sakshi
‘భగీరథ’లో వేగం

చురుగ్గా ఓవర్‌హెడ్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు
పైపుల సరఫరా.. ఊపందుకున్న నిర్మాణాలు
నీటి సరఫరాకు రూ.240 కోట్లు
218 గ్రామాలకు రక్షిత తాగునీటి సరఫరా లక్ష్యం

 ‘మిషన్ భగీరథ’ వేగం పుంజుకుంది. ఇంటింటికీ తాగునీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం మరికొన్ని నెలల్లో సాకారం కానుంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు భారీ నీటి సంప్‌లు, నీటి ట్యాంకులు నిర్మించే పనులను వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రధాన పైప్‌లైన్లు పనులు పూర్తి కాగా.. మండల కేంద్రాలు, గ్రామాలకు పైప్‌ల వేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేస్తుండడంతో  పురోగతి కొట్టొచ్చినట్లు కనపడుతోంది.  - చేవెళ్ల

నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లోని 214 గ్రామాలతో పాటుగా రాజేంద్రనగర్ మండలంలోని గండిపేట, కోకాపేట్, హిమాయత్‌సాగర్, ఖానాపూర్ గ్రామాలకు నీటిని అందించడానికి ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. కాగా నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట మండలంలోని గ్రామాలకు నీటి సరఫరా మాత్రం వికారాబాద్ మిషన్ భగీరథ పరిధిలోకి చేర్చారు. దీంతో ఇప్పటికే మండలాల్లోని ప్రధాన పైపులైను పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. నీటి సరఫరా పైపులను కూడా సరఫరా చేశారు.

 30 నెలల్లో పూర్తి..
2015 డిసెంబరు నుంచి 2018 జూన్ వరకు అంటే 30 నెలల కాల వ్యవధిలో ఈ పనులను పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటిని అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పనుల్లో పురోగతి కనిపిస్తోంది. నియోజవర్గంలో మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఏడు ఓహెచ్‌బీఆర్ (ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) అవసరం ఉండగా సింగాపూర్ వద్ద లక్ష లీటర్ల ట్యాంకు ఇప్పటికే ఉంది. కాగా.. మిగతా ఆరు రిజర్వాయర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బెంచ్ మార్క్‌కు (భూమి ఉపరితలానికి) 280 మీటర్ల ఎత్తులో షాబాద్ మండలం అంతారం వద్ద ఎత్తై ప్రదేశం ఉండడంతో అక్కడనే 40 ఎంఎల్‌డీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచే నియోజకవర్గంలోని మండలాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు.

 నీటి సరఫరా ఇలా
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ‘డ్రా వాటర్’ (శుద్ధిలేని నీరు)ను మొదటగా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద గల ఎలికట్ట చౌరస్తాలో నిర్మించనున్న భారీ సంపులోకి సరఫరా చేస్తారు. అక్కడి నుంచి షాబాద్ మండలం అంతారం వద్ద రెండు ఎకరాల్లో నిర్మించనున్న 40 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) ట్రీట్‌ఫ్లాంట్‌లోకి చేరుస్తారు. అనంతరం అక్కడే నిర్మించనున్న 10 లక్షల లీటర్ల ఓహెచ్‌బీఆర్ (ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నుంచి పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేయనున్నారు. ఇందులో భాగంగా షాబాద్ మండల కేంద్రంలో నిర్మించనున్న లక్ష 20 వేల లీటర్ల ఓహెచ్‌బీఆర్ ద్వారా 56 గ్రామాలకు రక్షిత తాగునీటిని సరఫరా చేస్తారు.

అంతారం వద్ద నిర్మించే పది లక్షల లీటర్ల ట్యాంకు ద్వారా మరో 25 గ్రామాలకు సరఫరా చేస్తారు.చేవెళ్ల మండల కేంద్రంలోని తహసీల్దార్  కార్యాలయం ఎదుట గల ప్రభుత్వ ఖాళీ స్థలంలో నిర్మిస్తున్న రెండు లక్షల ఓహెచ్‌బీఆర్ ద్వారా 38 గ్రామాలకు నీటి సరఫరా  చేయాలని నిర్ణయించారు. మండలంలోని దామరగిద్ద వద్ద నిర్మిస్తున్న లక్ష లీటర్ల ట్యాంకు  ద్వారా మరో 25 గ్రామాలకు నీటిని అందిస్తారు. చేవెళ్లలో నిర్మిస్తున్న ఓహెచ్‌బీఆర్ ద్వారా 4 లక్షల లీటర్ల నీటిని శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాల్లోని 74 గ్రామాలకు నీటిని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. శంకర్‌పల్లి మండలం సింగాపూర్ వద్ద ఇప్పటికే ఉన్న లక్ష లీటర్ల ఓహెచ్‌బీఆర్ ద్వారా కూడా వివిధ గ్రామాలకు నీటిని సరఫరా చేయనున్నారు.

వేగంగా పనులు
మిషన్ భగీరథ పనుల వేగంగా కొనసాగుతోంది. 2015 డిసెం బరు నుంచి 30 నెల లలోగా ఈ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగానే ఓహెచ్‌బీఆర్, పైపులైన్లు వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి లోగా పనులు పూర్తిచేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నాం. -వీ నరేందర్,  మిషన్ భగీరథ పథకం డీఈఈ, చేవెళ్ల

>
మరిన్ని వార్తలు