ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి

2 Aug, 2016 22:14 IST|Sakshi
ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి
  • కలెక్టర్‌ యోగితా రాణా
    • మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నిర్మాణ పనుల ప్రారంభం
    ఆర్మూర్‌అర్బన్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్‌ యోగితా రాణా అన్నారు. ఆర్మూర్‌ మండలంలోని కోమన్‌పల్లిలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించే పైపులైను నిర్మాణాన్ని కలెక్టర్‌ యోగితా రాణా, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్మూర్‌ నియోజకవర్గంలో కోమన్‌పల్లి నుంచి పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి తాగునీటిని ప్రతి ఇంటికి అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మిషన్‌ భగీరథకు ప్రభుత్వం రూ. 2,650 కోట్లు వ్యయం చేస్తోందన్నారు. తొలి విడతగా 121 గ్రామాలను ఎంపిక చేసి అందులో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు ఉన్న 47 గ్రామాలకు ముందుగా శుద్ధిజలాలను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో రూ. 150 కోట్లతో అంతర్గత పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కోమన్‌పల్లిలో పైప్‌లైన్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి వారం రోజుల్లో ఇంటింటికి తాగునీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అలాగే మిగతా గ్రామాల్లో ఈనెల 31 లోగా నీటి సరఫరా చేయనున్నామని చెప్పారు.
    రూ. 15 లక్షలు మంజూరు చేస్తా : ఎమ్మెల్యే
    గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, హరితహారంలో మొక్కల నాటాడాన్ని 100 శాతం పూర్తి చేసుకుంటే తన నిధుల నుంచి అదనంగా రూ. 15 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కోమన్‌పల్లి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఆర్మూర్‌ పట్టణానికి 100 పడకల ఆస్పత్రిని తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే ముందుగా ఆర్మూర్‌ నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పూర్తి చేసుకోవడానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఈఈ రమేశ్, ఆర్డీవో యాదిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రామారావ్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

     

>
మరిన్ని వార్తలు