-

అయ్యా...వీళ్లెవరు?

13 Jan, 2017 23:18 IST|Sakshi

– ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాలోనూ తప్పులు
– టీచర్ల జాబితాలో 88 మంది, పట్టభద్రుల్లో 1,715 మంది ‘థర్డ్‌ జెండర్లు’ ఉన్నట్లు ధ్రువీకరణ
– విద్యాశాఖలో ‘వాళ్లు’ లేనేలేరంటున్న అధికారులు
- గుణపాఠం నేర్వని అధికారులు!


అనంతపురం ఎడ్యుకేషన్‌ : అదే జాబితా.. మళ్లీ మళ్లీ అవే తప్పులు.. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాను పరిశీలిస్తే జిల్లాలో 31 మంది టీచర్లు (స్కూల్‌ అసిస్టెంట్లు) పురుషకాదు.. మహిళ కాని థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు. అనంతపురం నగరంలోని మూడు పోలింగ్‌ బూత్‌ల్లో పది మంది ఉన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా తయారు చేసిన అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతుండగా.. జిల్లా విద్యాధికారి మాత్రం  ‘రికార్డుల ప్రకారం జిల్లాలో ఒక్క టీచరూ థర్డ్‌ జెండర్‌కింద లేరు. ఉన్న వారంతా మహిళ, పురుష టీచర్లే.. జాబితాలో అలా ఎందుకొచ్చిందో తెలియద’ని చెప్తున్నారు.

పట్టభద్రుల్లో 17,15 థర్డ్‌ జెండర్లు
అనంతపురం, వైఎస్‌ఆర్‌ కడప, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్ర ఓటర్లు 2,53,515 మంది ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో పురుషులు 61,081 మంది, మహిళలు 27,402 మంది ఉండగా 777 మంది థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు. అలాగే వైఎస్సార్‌ కడప జిల్లాలో 54,643 మంది పురుషులు, 24,339 మంది మహిళలు ఉండగా 519 మంది థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి 59,410 మంది పురుషులు, 24,925 మంది మహిళా ఓటర్లు ఉండగా 419 మంది థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు. మొత్తం మీద 1,75,134 మంది పురుషులు, 76,666 మంది మహిళలు, 1715 మంది థర్డ్‌ జెండర్స్‌ ఉన్నట్లు అధికారులు తేల్చారు.

టీచర్లలో 88 మంది థర్డ్‌ జండర్లు  :
మూడు జిల్లాల్లోనూ ఉపాధ్యాయ ఓటర్లు 20,644 మంది ఉన్నారు. జిల్లాల వారిగా చూస్తే అనంతపురంలో 5,149 పురుష టీచర్లు, 2,637 మహిళా టీచర్లు ఉండగా 31 మంది థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో 3,949 మంది పురుష టీచర్లు, 1,898 మంది మహిళా టీచర్లు ఉండగా 30 మంది టీచర్లు థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి 4,499 మంది పురుష టీచర్లు, 2,424 మహిళా టీచర్లుండగా 27 మంది థర్డ్‌ జెండర్స్‌ ఉన్నారు. మొత్తం మీద 13,597 మంది పురుష టీచర్లు, 6,959 మంది మహిళా టీచర్లు 88 మంది థర్డ్‌ జెండర్‌ ఉన్నారు.

మళ్లీ మళ్లీ అవే తప్పులు
నవంబరులో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ ఇవే తప్పులు దొర్లితే ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అయితే అధికారులు స్పందించి ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని తుది జాబితా విడుదల చేసే నాటికి చిన్నచిన్న తప్పులను సరిదిద్దుతామంటూ సర్ది చెప్పుకున్నారు. అయితే అదే నిర్లక్ష్యం...అవే తప్పులు దొర్లాయనేది తుది జాబితాను పరిశీలిస్తే  స్పష్టమవుతోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.తప్పును సరిదిద్దుకోకుండా మళ్లీమళ్లీ అవే తప్పులు చేస్తున్నారంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే...
ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముసాయిదా జాబితా విడుదల చేసిన సమయంలో ఎలక్ట్రోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి మల్లీశ్వరదేవిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పైగా తుది జాబితా కూడా తప్పుల తడకగా మారింది. కొన్నిచోట్ల కేజీబీవీ టీచర్ల పేర్లను తొలిగిస్తే.. మరికొన్ని చోట్ల అలానే ఉంచారు. కొందరి టీచర్లు పేర్లు ఉన్నా, స్కూళ్ల పేర్లు కనిపించలేదు.
 – ఉపాధ్యాయ సంఘాలు

జాబితాలోకి వాళ్లెలా వచ్చారో తెలియదు
రికార్డుల మేరకు జిల్లాలో ఒక్క ఉపాధ్యాయుడూ థర్డ్‌ జెండర్‌ కింద లేరు. ఉన్న ఉపాధ్యాయులంతా పురుష, మహిళలే. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల టీచర్ల తుది జాబితాలో మరి అలా వాళ్లెలావచ్చారో తెలియదు.
- శామ్యూల్‌, జిల్లా విద్యాధికారి, అనంతపురం

మరిన్ని వార్తలు