మరమ్మతుల పేరుతో దోపిడీ

7 Oct, 2016 00:52 IST|Sakshi
మరమ్మతుల పేరుతో దోపిడీ
  •  కార్పొరేషన్లో వాహనాల బాగోతం
  • కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై వాటాల పంపిణీ
  •  
    నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థలో అడుగడుగునా దోపిడీ జరుగుతోంది. ప్రతి విభాగంలో కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు కమీషన్ల రూపేణా దోచుకుంటున్నారు. చెత్తను తరలించే వాహనాల మరమ్మతుల పేరుతో ప్రతి నెలా రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్‌ చెందిన సొంత వాహనాలు 83 ఉన్నాయి. వీటిలో 20 లారీలు, 54 ఆటోలు, 4 ట్రాక్టర్లు, 5 డంపర్లు ఉన్నాయి. వీటిలో కేవలం 60 వాహనాలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో చెత్తను సేకరించి దొంతాలి డంపింగ్‌ యార్డ్‌కు తరలిస్తుంటారు. అయితే నిత్యం చెత్తవాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. కేవలం మరమ్మతులకే ఏడాదికి రూ.50 లక్షలపైన ఖర్చు చేస్తుండటం గమనార్హం.
    పాత వాహనాలే వినియోగం
    నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్న సమయం నుంచి వినియోగిస్తున్న వాహనాలనే ప్రస్తుతం అధికారులు నెట్టుకొస్తున్నారు. ఏ క్షణం ఎక్కడ వాహనం నిలిచిపోతుందో అర్థకాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని వాహనాలకు బ్రేకులు పడకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఉన్న వాహనాలతోనే చెత్తను తరలిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాల్లో 90 శాతం కాలం చెల్లినవే ఉన్నాయి. కార్పొరేషన్‌ వాహనాలు కావడంతో రవాణా శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. 
    దోపిడీ..
    వాహనాలు నిత్యం మరమ్మతులకు గురికావడంతో కార్పొరేషన్‌ నిధుల నుంచి ప్రతి నెలా లక్షలను ఖర్చుచేయాల్సి వస్తోంది. వాహనాల రిపేర్లు, స్పేర్‌పార్ట్స్‌ను తీసుకొచ్చే పనులను కాంట్రాక్టర్‌ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో స్పేర్‌పార్ట్స్‌ ధర రూ.వెయ్యి కాగా రూ.రెండు వేలుగా ఎస్టిమేషన్‌ వేసి దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రిపేర్లు చేస్తున్నట్లు రూ.వేల కార్పొరేషన్‌ నిధులను కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టర్లు డీఈ, ఏఈ స్థాయిలో అధికారులకు పర్సంటేజీలను ప్రతి నెలా ఇస్తుండాలి. ఇవి రాకపోతే బిల్లులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తుంటారు. 
    కొత్త వాహనాల కొనుగోలుపై దృష్టేదీ..?
    ఏళ్ల నాటి వాహనాలను వినియోగిస్తున్న కార్పొరేషన్‌కు కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా పాలకవర్గం చోద్యం చూస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా ఖర్చు పెట్టే నిధుల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరుతుంది. అధికార పార్టీ చెందిన ఓ నాయకుడు మరమ్మతులు చేసే కాంట్రాక్టర్‌ వద్ద ప్రతి నెలా పర్సంటేజీలను తీసుకుంటున్నారని సమాచారం. 
     
     
మరిన్ని వార్తలు