మిత్రభేదం

21 Mar, 2017 00:05 IST|Sakshi
మిత్రభేదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు మళ్లీ రాజుకు న్నాయి. కలహాల కాపురం చేస్తున్న ఆ రెండు పార్టీల నేతల మధ్య వివా దానికి ఈసారి తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపలి్ల మేకల సంత వేదికైంది. ఈ వివాదాన్ని సాకుగా చూపి జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. గత వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద  జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మిత్రపక్షంతో ఉన్న విభేదాలను పరిష్కరించాలి్సన బాధ్యత జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పెట్టారు. ఆయన ఇంకా జిల్లాకు రాకముందే ఈ వివాదం పెరిగి పెద్దదవుతోంది. పెదతాడేపలి్లలోని మేకల సంత ఎవరు నిర్వహించాలనే దానిపై టీడీపీ, బీజేపీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం ముదిరి పాకానపడింది. దీనిని అడ్డం పెట్టుకుని జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి సంబంధించి ఒకే వేదికపై చర్చకు రావాలని సవాల్‌ విసరగా, తాను ఆ స్థాయికి దిగజారబోనని మంత్రి సమాధానం ఇవ్వడంతో వివాదం ముదిరింది. సోమవారం ఉదయం ఇరువర్గాలు పెదతాడేపల్లిలో మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మేకల సంతపై పాత నిర్వాహకులకే హక్కు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మంత్రి మాణిక్యాలరావు వాదిస్తున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీపీఓతోపాటు, జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ఈ సంత పాత వారికే చెందుతుందని ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెబుతున్నారు. అప్పిలేట్‌ అథారిటీ ఆదేశాలు సైతం ఆ సంఘానికే అనుకూలంగా ఉన్నాయని, ఆ ఉత్తర్వులను అమలు చేయాలంటూ జిల్లా పంచాయతీ అధికారి ద్వారా పెదతాడేపల్లి గ్రామ కార్యదర్శికి ఆదేశాలు వెళ్లడంతో ఈ నెల 17వ తేదీన గ్రామ కార్యదర్శి ఆ సంఘానికి లైసెన్సు ఇచ్చారని మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం నిర్వాహకుల్లో రెండు వర్గాలు ఉన్నాయని, వారిని కూర్చొబెట్టి తాము రాజీ చేస్తున్న తరుణంలో మంత్రి ఏకపక్షంగా లైసెన్సులు ఇప్పించడం ఏమిటని వాదిస్తున్నారు. ఈ లైసెన్సులను తాము ఒప్పుకునేది లేదంటూ సంతను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 
రెండువర్గాలు చేస్తున్న రాద్ధా్దంతంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పేరున్న పెదతాడేపల్లి మేకల సంత ప్రాభవం కోల్పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సందర్భంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై అధిపత్యం కోసం జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు చేస్తున్న ప్రయత్నాలను మిత్రపక్షమైన బీజేపీ సీరియస్‌గా తీసుకుంటోంది. పదేపదే వివాదాలు సృస్టిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం మంత్రి కంటే తాను ఒక్క పైసా తక్కువ ఖర్చు పెట్టినా రాజీనామా చేస్తానని జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు పేర్కొనడాన్ని వారు తప్పుపడుతున్నారు. తాను నిట్, బకింగ్‌హాం కెనాల్‌ జలరవాణా, ఆర్‌ అండ్‌ బీ రోడ్ల కోసం తెచ్చిన నిధులను ఒకసారి బేరీజు వేసుకోవాలని, తానైతే ఎవరి రాజీనామా కోరడం లేదని మంత్రి మాణిక్యాలరావు పరోక్షంగా బాపిరాజును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇరుపక్షాల వివాదానికి సంతను వేదికగా చేసుకోవడంపై మేకల, గొర్రెల వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. 
 
మరిన్ని వార్తలు