'నిరూపిస్తే ఆ భూమి నీకే రాసిస్తా'

16 Jul, 2016 20:18 IST|Sakshi
'నిరూపిస్తే ఆ భూమి నీకే రాసిస్తా'

- డిప్యూటీ సీఎం కేఈకి పీఏసీ  చైర్మన్‌ బుగ్గన సవాల్‌
- హంద్రీనీవా భూసేకరణలో బీనామీ పేర్లతో కేఈ కుటుంబీకులు రూ.కోట్లు స్వాహా


డోన్‌ టౌన్‌: తన కుటుంబీకుల పేరుతో తొమ్మిది వందల ఎకరాల భూములు ఉన్నట్లు డిప్యూటీ సీఎం కేఈ  కృష్ణమూర్తి ఆరోపణలు చేయడంపై పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో  మండిపడ్డారు. డోన్‌ ఆర్‌ఈ రవికుమార్‌ స్వగృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలను కేఈ నిరూపిస్తే 899 ఎకరాల భూమిని ఆయనకే  రాయించి ఒక ఎకరం మాత్రమే కేఈకి గుర్తుగా ఉంచుకుంటానని ఎద్దేవా చేశారు. వాస్తవంగా చెర్లోపల్లిలో తన పేరుపై  ఎకరా భూమి ఉండగా కేఈలాంటి వ్యక్తులు అబద్దాలు, అభూత కల్పనలతో ప్రచారం చేయడం తగదన్నారు. బినామీ  పేర్లతో ప్రజాధనాన్ని బొక్కేయడంలో కేఈ కుటుంబీకులుకు మించిన వారు జిల్లాలో లేరన్నారు.

ఓర్వకల్లు సెజ్‌ ప్రాంతంలో, కంబాలపాడు హంద్రీనీవా భూసేకరణలో ప్రభుత్వ భూములకు బీనామీ పేర్లతో పట్టాలు  సృష్టించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని   దిగమింగారని ఆరోపించారు. కేఈ కుటుంబీకులు అభివృద్ధి పనులకు  ఏనాడు సెంటు స్థలం ఇవ్వలేదన్నారు. వంద ఏళ్ల చరిత్ర ఉన్న తన సొంత భూమికి భూసేకరణ చట్టప్రకారం నష్ట  పరిహారం కోరానే తప్ప, అభివృద్ధి పనులను ఏనాడు అడ్డుకోలేదన్నారు. చెర్లోపల్లిలోని ఎకరా భూమికి తానే  యజమానినని, భూమిపై తనకు సర్వహక్కులు ఉన్నాయని బుగ్గన ప్రకటించారు. కేఈ ఇంటిలో రోడ్డు వెడల్పంటూ  అడుగు స్థలం దౌర్జన్యంగా ఆక్రమిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. తనకు నోటీసు ఇవ్వకుండా అధికారమదంతో  పోలీసులను అడ్డుపెట్టుకొని స్థలాన్ని ఆక్రమిస్తే కోర్టుకు వెళ్లడం తప్ప తనకు మరో మార్గం కనపడలేదన్నారు.

అడిగితే ఉచితంగా ఇచ్చేవాడిని:
అభివృద్ధి పనులకు తాను వ్యతిరేకమని కేఈ ప్రచారం చేయడంపై బుగ్గన మండిపడ్డారు. నష్టపరిహారం చెల్లించి  చట్టప్రకారం భూమిని తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను తానే స్వయంగా కోరిన విషయాన్ని బుగ్గన గుర్తుచేశారు.  సామరస్యంగా తనను అడిగినట్లయితే ఎకరం భూమిని ఉచితంగా ఇచ్చేవాడినని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ  సభ్యుడు శ్రీరాములు, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు పుల్లారెడ్డి, వెంకోబరావ్, రాజవర్దన్, దినేష్‌గౌడ్,  మల్లెంపల్లి రామచంద్రుడు,పెద్దిరెడ్డి, కోట్రికే హరికిషన్, రాజశేఖర్‌రెడ్డి, గజేంద్ర, కటిక వేణు తదితరులు పాల్గొన్నారు.  
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా