చండీయాగం ఫలాలు దక్కాలంటే..జోగుళాంబ జిల్లా చేయాలి

20 Jul, 2016 04:02 IST|Sakshi
చండీయాగం ఫలాలు దక్కాలంటే..జోగుళాంబ జిల్లా చేయాలి

- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే డీకే అరుణ విజ్ఞప్తి
- లేకుంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని హెచ్చరిక
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయుత చండీయాగం ఫలాలు దక్కాలంటే..  జోగుళాంబ జిల్లాగా గద్వాలను ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ కోరారు. గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే డీకే అరుణ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల మండలం జమ్ములమ్మ ఆలయం నుంచి అలంపూర్ జోగుళాంబ ఆలయం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మంగళవారం స్థానిక జమ్ములమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలసి పాదయాత్రను ప్రారంభించారు.

మొదటిరోజు 14 కిలోమీటర్ల పాదయాత్ర గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా వరకు సాగింది.   ప్రజలనుద్దేశించి ఆమె  మాట్లాడుతూ ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన మానుకోవాలని  కోరారు. అర్హత ఉన్న ప్రాం తాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని సూచించారు. నడిగడ్డ ప్రజల త్యాగాలు, ఈ ప్రాంత వెనుకబాటు, వనరులను దృష్టిలో ఉంచుకొని జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఎర్రవల్లి చౌరస్తాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో డీకే అరుణ బస చేశారు.

మరిన్ని వార్తలు