టోల్‌గేట్‌ ఉద్యోగిపై ఎమ్మెల్యే డ్రైవర్‌ దాడి

10 Aug, 2016 23:26 IST|Sakshi
తిమ్మాపూర్‌ : మండలంలోని రేణికుంట టోల్‌ప్లాజా వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిపై మంథని ఎమ్మెల్యే పుట్ట మధు డ్రైవర్‌ చేయిచేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పుట్ట మధు కారు రేణికుంట టోల్‌ప్లాజా వద్ద మిగిలిన వాహనాలు వెళ్లేదారిలోనే వచ్చింది. టోల్‌ కలెక్షన్‌ సెంటర్‌ వద్ద అప్పటికే వాహనం ఉండడంతో ఎమ్మెల్యే వాహనం ఆగింది. తమlవాహనానికి క్లియరెన్స్‌ ఇవ్వడంలేదని ఎమ్మెల్యే డ్రైవర్‌ ప్రశ్నించాడు. వీఐపీలకు ప్రత్యేక దారి ఉందని, అలా వెళ్లాలని టోల్‌ప్లాజాలో పని చేస్తున్న లేన్‌ అసిస్టెంట్‌ నాగరాజు అన్నాడు. వెంటనే కారు దిగిన డ్రైవర్‌ నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు. దీనిపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎల్‌ఎండీ పోలీసులు తెలిపారు. 
ఉద్యోగి వసూళ్లపై డీటీసీకి ఫిర్యాదు
 ఆర్టీఏ ఆఫీసులో ఓ ఉద్యోగి వసూళ్లపర్వంపై ఆర్టీసీ డ్రైవర్లు బుధవారం డీటీసీ వినోద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌంటర్‌ వద్ద ఉన్న రామ్మూర్తి డబ్బులిస్తేనే పనులు చేస్తున్నాడని, లేకుంటే ఇబ్బంది పెడ్తున్నాడని ఆర్టీసీ డ్రైవర్లు ముల్గు రవీందర్, కోరెపు శంకరయ్య డీటీసీకి వివరించారు. తాను చేయని పని మిగతా కౌంటర్‌లో చేశారని రవీందర్, తన వద్ద ఒక అప్లికేషన్‌కు రూ.100 వసూలు చేశాడని శంకరయ్య తెలిపారు. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డీటీసీ స్పందిస్తూ ఉద్యోగికి వర్క్‌ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫీసులో ఉద్యోగులు దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టకుండా మెరుగైన సేవలు అందించాలని, ఎవరైనా డబ్బులు అడిగితే దరఖాస్తుదారులు తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా చర్యలు తీసుకుంటానని డీటీసీ తెలిపారు. 
 
మరిన్ని వార్తలు