ముందుచూపు లేక ఇబ్బందులు

12 Dec, 2016 14:48 IST|Sakshi
ముందుచూపు లేక ఇబ్బందులు
పెద్దనోట్ల రద్దుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి 
సీఎం చంద్రబాబు లేఖలు ఇచ్చినప్పుడల్లా అరిష్టమే
కొత్తపేట : కేంద్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో నియోజకవర్గంలో మంగళవారం పలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్న పేద,సామాన్య ప్రజానీకానికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కొత్తపేట ఆంధ్రాబ్యాంకు వద్ధ జగ్గిరెడ్డి స్వయంగా ప్రజలకు మజ్జిగ అందచేశారు.ఈ సందర్బంగా ఆయన బీఎం బీహెచ్‌ రవిశంకర్‌తో బ్రాంచ్‌కు నగదు సరఫరా, పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.రైతులకు ఎంత ఇవ్వాలి?పెళ్లిళ్లు చేసుకుంటే ఎంత ఇవ్వాలి? ప్రభుత్వ పెన్షనర్‌కు రూ.10 వేలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ మీరు ఎంత ఇస్తున్నారు? అంటూ బీఎంను ప్రశ్నించారు. రైతుకు రూ.50వేలు, పెళ్లికి రూ 2.5 లక్షలు ఇవ్వాలని చెప్పిన మాట మాట వాస్తవమే కానీ ఇక్కడ నగదు వుండాలి కదా సార్‌. ఆంధ్రాబ్యాంక్‌కు సంబంధించి జిల్లాకు కేవలం రెండు చెస్ట్‌లే వున్నాయి. వచ్చిన నగదును వచ్చినట్టుగా పంపిణీ చేస్తున్నాం అంటూ బీఎం సమాధానం చెప్పారు. 
బాబూ.. లేఖలు రాయొద్దు
జగ్గిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు లేఖలు (రాష్ట్ర విభజనకు, పెద్ద నోట్ల రద్దుకు) ఇచ్చినప్పుడల్లా రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి ఇకపై ఎప్పుడూ లేఖలు రాయవద్దని జగ్గిరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజా సమస్యలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణ శూన్యమన్నారు. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు, బ్యాంకర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, మండల పార్టీ కన్వీనర్‌ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు