చెప్పేదొకటి.. చేసేదొకటా..?

10 Nov, 2016 00:12 IST|Sakshi
చెప్పేదొకటి.. చేసేదొకటా..?
  • మార్కింగ్‌ ప్రకారం ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పి మాట మారుస్తారా
  • కమిషనర్‌పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం
  • జేసీబీకి అడ్డుపడి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
  •  
    నెల్లూరు సిటీ / మినీబైపాస్‌: పంటకాలువలపై ఆక్రమణల తొలగింపులో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వచ్ఛందంగా ఆక్రమణల తొలగింపునకు పీటర్స్‌ కాలువను ఆనుకొని ఉన్న నీలగిరి సంఘ వాసులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో 13 ఇళ్ల ఆక్రమణలను తొలగించేందుకు బుధవారం ఉదయం టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేశారు. జేసీబీ సాయంతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని స్థానికులకు అండగా ఉంటానని, హౌస్‌ ఫర్‌ ఆల్‌లో ఇళ్లు అందేలా చూస్తానని, అప్పటి వరకు బాడుగలు అందేలా అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే ఆక్రమణల తొలగింపునకు సంబంధించి అధికారులు ఎమ్మెల్యేకు ఉదయం ఓ ప్లాన్‌ చూపారు. సాయంత్రానికి అధికారులు మరో ప్లాన్‌ను తీసుకొని ఆక్రమణల తొలగింపును చేపట్టారు. 13 ఇళ్ల తొలగింపులో ఓ ఇంటికి సంబంధించిన బాత్రూమ్‌ను తొలగిస్తామని ఉదయం చెప్పిన అధికారులు సాయంత్రానికి సదరు ఇంటి బాత్రూమ్‌తో పాటు ఇంటిని కూడా తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో స్థానికులు ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. దీంతో కోటంరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని కమిషనర్‌ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. ఉదయం తనకు చూపించిన ప్లాన్‌ ఏమిటని.. ఇప్పుడు చేస్తోందని ఏమిటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీకి ఎమ్మెల్యే అడ్డుపడి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ముత్యాలరాజుకు ఫోన్‌ చేసి అధికారులు వ్యవహరించిన తీరును తెలిపారు. స్థానికులకు అండగా నిలవడంతో ఆక్రమణల తొలగింపును నిలిపేశారు.
    మహిళకు గాయాలు
    నీలగిరి సంఘంలో యాకసిరి శ్రీనివాసులు, కీర్తి కొన్నేళ్లుగా పీటర్స్‌ కాలువ పక్కన ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఆక్రమణల తొలగింపులో తన ఇళ్లు ఎక్కడ కూలిపోతుందోననే ఆందోళనతో కీర్తి మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడటంతో ఎడమ చేయి విరిగింది. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
    ప్లాన్‌ను పునఃపరిశీలిస్తాం
    నీలగిరి సంఘంలో పీటర్స్‌ కాలువపై ఆక్రమణల ప్లాన్‌ను పునఃపరిశీలిస్తామని మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసనతో మేయర్‌ అక్కడికి చేరుకొని మాట్లాడారు. ప్లాన్‌ను మార్చాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్లాన్‌ ప్రకారం ఆక్రమణలను తొలగించి, బాధితులకు ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ఇళ్ల ఏర్పాటు, అప్పటి వరకు బాడుగ రూపంలో రూ.రెండు వేలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్‌ అజీజ్, కమిషనర్లకు ఎమ్మెల్యే సూచించారు. దీనికి మేయర్‌ హామీ ఇచ్చారు. ఆక్రమణల తొలగింపును తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
     
     
మరిన్ని వార్తలు