....కొడకా నీ అంతు చూస్తా

15 Sep, 2017 22:14 IST|Sakshi
....కొడకా నీ అంతు చూస్తా

- దళితుడిపై ఎమ్మెల్యే పల్లె జులుం
- ప్రశ్నిస్తే కాళ్లు పట్టించారంటూ బాధిత కుటుంబం ఆవేదన


అమడగూరు: నమ్మి ఓటేసిన పాపానికి ప్రజాప్రతినిధులతో తిట్లు తిని కాళ్లు పట్టుకొనే పరిస్థితి దాపురించిందని మహమ్మదాబాద్‌ ఎస్సీ కాలనీకి చెందిన ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. శుక్రవారం బాధితులు విలేకరులతో మట్లాడారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా గురువారం అమడగూరు మండలంలోని మహమ్మదాబాద్‌ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 9 గంటల సమయంలో ఎమ్మెల్యే ఎస్సీ కాలనీలో ప్రచారం చేపట్టారు. అయితే కాలనీ ప్రారంభంలోనే ఎమ్మెల్యే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కాలనీలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నీటి సమస్యను కూడా పరిష్కరరించలేకపోతే ప్రజాప్రతినిధులెందుకు అని స్థానికులు ప్రశ్నించారు.

దీంతో ఎమ్మెల్యే పల్లె ఆ కాలనీ వాసులతో మారెమ్మ గుడి వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. పల్లె మాట్లాడుతూ మీ కాలనీకి సీసీ రోడ్లు వేశామని. పింఛన్లు ఇస్తున్నామని, ఇళ్లు మంజూరు చేశామని అయినా మీరు ఇలా ప్రశ్నించడం బాలేదన్నారు. వెంటనే సమావేశంలో ఉన్న ఓ నిరుద్యోగి ఆదినారాయణ మాట్లాడుతూ కొత్త ఇళ్లు ఎవరికిచ్చారు సార్‌ మా అక్క వాళ్లకు ఇళ్లు లేక అగచాట్లు పడుతున్నారు. కాలనీకి ఇచ్చిన 5 ఇళ్లు టీడీపీ కార్యకర్తలకే సరిపోయాయని చెప్పగా పల్లె తీవ్రమైన కోపంతో ఎవడ్రా నువ్వు ... కొడకా అంటూ ఉద్రేకంతో ఊగిపోయాడు. పెద్ద చదువులు చదువుకున్నావ్‌ భవిష్యత్‌లో ఉద్యోగం కూడా రాకుండా చేస్తా . ఈ ప్రచారం పూర్తికానీ  నీ కథ తేలుస్తా అంటూ ప్రచారంలోకి వెళ్లాడు. రాత్రి పది గంటల తర్వాత తిరిగి స్థానిక నాయకులతో కలసి తిరిగి ఆదినారాయణ ఇంటికి వచ్చి కూర్చున్నాడు.

ఆ సమయంలో ఆది ఇంటిలో లేకపోవడంతో ఎంత సేపైనా వేచి చూస్తా వెళ్లి వాన్ని వెతికి పట్టుకురండని పోలీసులను ఆదేశించాడు. పల్లెకు భయపడి తన స్నేహితుని ఇంటిలో దాక్కున్న ఆదిని పోలీసులు కనుక్కొని పల్లె వద్దకు తీసుకువచ్చారు. స్థానిక నాయకులు, పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఓ గదిలోకి తీసుకెళ్లి ఆది, వాళ్ల మామ ఆంజినేయలు ఇద్దరి చేత పల్లె రఘనాథరెడ్డి కాళ్లు పట్టించి సారీ చెప్పించారు. చివర్లో కూడా పల్లె మాట్లాడుతూ భవిష్యత్తులో ఎక్స్‌ట్రా చేశావంటే పుట్టగతులు లేకుండా చేస్తానని హెచ్చరించారు. అయితే ఈ పరిణామం జరిగినప్పటి నుండి ఆది కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కరువైంది. బజార్లోకి రావాలంటే సిగ్గు పడుతున్నారు. ఇంత పెద్ద చదువులు చదువుకుని, తప్పు చేసినట్లు ఇలా కాళ్లు పట్టుకోవడం ఏంటని ఆదినారాయణ తనలో తానే కుమిలిపోతున్నాడు.
కస్సముద్రంలో సర్పంచ్‌కు అవమానం

అమడగూరు మండలంలో బుధవారం నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కూడా గ్రామ వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ లోకేష్‌రెడ్డి ప్రచారరథంలోకి ఎక్కి మట్లాడుతుండగా ఎంపీ నిమ్మల కిష్టప్ప ఒక్కసారిగా మైక్‌ లాక్కొని దిగి పోవయ్యా నీ కథలు వినేవారు ఎవరూ లేరని కిందకు దింపేశారు.

మరిన్ని వార్తలు