ఎమ్మెల్యే రాధాకృష్ణను అరెస్ట్‌ చేయాలి

21 May, 2017 03:29 IST|Sakshi

ఏలూరు అర్బన్‌ : పోలీసు అధికారులపై అనుచితంగా ప్రవర్తించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, అతని అనుచరులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఏపీ పోలీసు అధికారుల సంఘం శనివారం ఏలూరులో ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యే రాధాకృష్ణ తీరుపై సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎం.గంగాధర్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.శ్రీనివాసరావు, డి.సుబ్రహ్మణ్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొంతకాలంగా ప్రజాప్రతినిధులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులపై దాడులకు దిగడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్త చేశారు. పోలీసులపై దాడికి పాల్పడే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని, ఘటనపై శాసనసభ స్పీకర్‌ను కలిసి ఎ«థిక్స్‌ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హోం శాఖ మంత్రి, డీజీపీకి నివేదిక సమర్పించి భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి దాడులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్‌ చేస్తామని, అప్పటికీ ఫలితం లేకపోతే హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి టి.గో పాల్, జిల్లా సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కె.నాగరాజు, కె.రజనీకుమార్, నాయకులు కృపానందం, టి. రాజు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు