అవినీతిపై పోరాడుతున్నందునే అక్రమ కేసులు

22 Jun, 2016 02:36 IST|Sakshi
అవినీతిపై పోరాడుతున్నందునే అక్రమ కేసులు

అవినీతి అధికారులను వదిలే ప్రసక్తే లేదు
ఉద్యమించైనా హక్కులను కాపాడుకుంటాం
పిలిచి అవమానించడం న్యాయమేనా..?
ప్రొటోకాల్ ఉల్లంఘించే వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి
అధికారుల తీరుపై విరుచుకుపడిన
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

కడప కార్పొరేషన్: అవినీతిపై పోరాడుతున్నందునే వ్యవసాయ శాఖ ఏడీ, ఏఓలు తనపై అక్రమ కేసు నమోదు చేయించారని  మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వ్యవసాయశాఖ అధికారులు అవలంబించిన తీరుపై నిప్పులు చెరిగారు. ఏరువాక కార్యక్రమం ఉందని వ్యవసాయ శాఖ ఏడీ, ఏఓ పిలిస్తేనే వెళ్లానని, తాను ఎంపీడీఓ కార్యాలయంలో ఉండగానే టీడీపీ నాయకులు సుధాకర్ యాదవ్, రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలతో కార్యక్రమం ప్రారంభించి, పరికరాలు పంపిణీ చేశారన్నారు.

నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా... సీనియర్ శాసన సభ్యుడినైన తన పట్ల అధికారులు వ్యవహించే తీరు ఇదేనా అని ధ్వజమెత్తారు. మైదుకూరు వ్యవసాయ శాఖ అవినీతిలో ముందుందని, విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.   ఏడీ అవినీతిపై గత ఏడాది డిసెంబర్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశానన్నారు.  ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు బాధ్యతలతోపాటు ప్రొటోకాల్ ఉంద ని, దాన్ని రక్షించే బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఆయన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. తన హక్కుల కోసం ఏరకమైన పోరాటాలు చేసేందుకైనా సిద్ధమన్నారు.

 దూషించే తత్వం మాకు లేదు
అధికారులను దూషించే మనస్తత్వం, బెదిరించే సంస్కృతి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టి ఈడ్చిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని లాంటివారు టీడీపీలోనే ఉన్నారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు ఏ పార్టీకి చెందినవారైనా వారిని గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.     ఇన్‌పుట్ సబ్సిడీ రాక, ఇన్స్యూరెన్స్ రాక రైతులు అష్టకష్టాలు పడుతుంటే ‘ఏరువాక’ అంటూ ఏ మొఖం పెట్టుకొని రైతుల వద్దకు వస్తున్నారని నిలదీశారు.

 ప్రొటోకాల్ ఉల్లంఘనపై నేడు వైఎస్‌ఆర్ సీపీ ర్యాలీ
కడప కార్పొరేషన్: ప్రజా ప్రతినిధులను, ప్రొటోకాల్‌ను  పక్కనబెట్టి ఓడిపోయిన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న జిల్లా అధికారయంత్రాంగం చర్యలకు నిరసనగా బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతనిధులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. 

>
మరిన్ని వార్తలు