‘ఫిరాయింపుల’ తీర్పుపై అప్పీల్‌

16 Dec, 2016 02:53 IST|Sakshi
‘ఫిరాయింపుల’ తీర్పుపై అప్పీల్‌

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ
అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు


సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై గురువారం విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

తమ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, జి.సాయన్న, ప్రకాశ్‌గౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కె.పి.వివేకానంద్, మాగంటి గోపీనాథ్, అరెకపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ నేతలు స్పీకర్‌ ముందు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను పరిష్కరించకుండానే టీఆర్‌ఎస్‌లో టీటీడీఎల్‌పీ వీలైనమైనట్లు పేర్కొంటూ శాసనసభ కార్యదర్శి పేరు మీద బులిటెన్‌ జారీ అయింది. ఈ బులిటెన్‌ రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, స్పీకర్‌ తీరును ఆక్షేపించారు. తన ముందున్న అనర్హత పిటిషన్లను పరిష్కరించకుండానే, టీటీడీఎల్‌పీ విలీనంపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు.  రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం ఈ కేసులో స్పీకర్‌ ఓ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయన నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలంటూ గత సెప్టెంబర్‌ 21న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈనెల 21తో మూడు నెలల గడువు ముగియనున్న నేపథ్యంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం ధర్మాసనం విచా రణ చేపట్టింది. ఈ సందర్భంగా కార్యదర్శి తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, అనర్హత పిటిషన్లు స్పీకర్‌ వద్ద పెండిం గ్‌లో ఉన్నప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని తెలిపారు. అధికరణ 212 ప్రకారం శాసన వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం తగదని చెప్పారు. పూర్తిస్థాయి వాదనల నిమిత్తం విచారణ సోమవారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు