పోడుభూములపై సీఎం స్పష్టత ఇవ్వాలి

16 Jul, 2016 18:33 IST|Sakshi
అశ్వారావుపేట రూరల్: ఎన్నోఏళ్లుగా గిరిజ నులు సాగుచేసుకొని జీవిస్తున్న పోడు భూములపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌లు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రం లో పోడు భూముల సమస్యను పరిష్కరించి,గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ  భారీ ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ వేణుగోపాల్‌రెడ్డికు వినతి పత్రాన్ని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ  మండలంలోని వాగొడ్డుగూడెం, మల్లాయిగూడెం గ్రామాల్లో దాదాపు రెండొందల మంది గిరిజ నులు ఇరవై ఏళ్ల క్రితం పోడు నరికి పంటలు సాగుచేసుకుంటున్నారన్నారు.
 
ఆ భూములను అటవీ అధికారులు దౌర్జన్యంగా లాక్కునేందుకు పోలీసుల సహాయంతో గిరిజనుల పై అన్యాయంగా కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే అలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అటవీ అధికారులు, పోలీసులు తీరు మార్చుకోకపోతే పోడు పోరును మరింత ఉధృతం చేసి భూములను కాపాడుకుంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పోడు భూములపై సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో సమస్య ఉత్పన్నం అవుతుందని వాపోయారు. 
 
కలెక్టర్ దృష్టికి పోడు వివాదం..
పోడుభూముల వివాదంపై శుక్రవారం అశ్వారావుపేటలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ దృష్టికి సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ పోడు భూములపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. 
మరిన్ని వార్తలు