‘బాబు’ గొప్పలకు ప్రజలు అప్పుల పాలు

21 Mar, 2017 22:41 IST|Sakshi
‘బాబు’ గొప్పలకు ప్రజలు అప్పుల పాలు
ఎమ్మెల్సీ బోస్‌ ఆక్షేపణ
రామచంద్రపురం : చంద్రబాబు సర్కారు గొప్పల కోసం ప్రజలను అప్పులు పాలు చేస్తోందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ విమర్శించారు. మంగళవారం రాత్రి రామచంద్రపురం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నా వృద్ధి రేటు సాధిస్తున్నామని చెబుతూ గొప్పలకు పోతోందన్నారు. వర్షాభావ పరిస్థితులు, కరువు, వ్యవసాయానుబంధ రంగాల తిరోగమనం, నీటి పారుదల రంగంలో రాష్ట్రం మౌనం వహించటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చులో వెనుకబాటు తదితర వాటిని మండలిలో ప్రస్తావించానని చెప్పారు. 2014–15లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రూ.1.40 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడితే విభజన అనంతరం రెండు రాష్ట్రాల బడ్జెట్‌ ప్రస్తుతం రెట్టింపు అయిందన్నారు. లోబు బడ్జెట్‌ నేరం కాదని పరిమితికి మించి ఉండకూదన్నారు. ప్రపంచ సరాసరి వృద్ధి రేటు 3.1శాతం, దేశంలో వృద్ధి రేటు 7.1శాతం కాగా నోట్ల రద్దు అనంతరం అది 6.06 శాతానికి పడిపోయిందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతున్నట్టే రెవెన్యూ లోటు కూడా పెరుగుతుందన్నారు. వృద్ధి రేటు పెరుగుతున్నప్పుడు రాబడి పెరగాలని రాష్ట్రంలో అలా లేకపోవటంతో సర్కారు చెబుతున్న వృద్ధి రేటు నమ్మశక్యంగా లేదని నిపుణులు అనుమానిస్తున్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు, సేవల రంగాల్లో వృద్ధితోనే జీడీపీ పెరుగుతుందన్నారు. ఆ రంగాలేవి ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధిలో లేవని ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లోనే తేట తెల్లమవుతుందన్నారు. ఖరీఫ్‌లో 2014 నాటికి, ఇప్పటికీ చూస్తే అన్ని పంటలు కలిపి 5.24 లక్షల హెక్టార్లు, రబీలో 7.59 లక్షల హెకార్లలో పంట విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. 2014లో 13 జిల్లాల్లో 234 కరువు మండలాలుండగా 2016–17లో 301 మండలాలకు పెరగ్గా అనంతపురం కర్నూలు, ప్రకాశంలో పూర్తి దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఎంపెడా సంస్థ 30శాతం చేపల ఎగుమతులు జరిగాయని చెబుతుంటే ఆర్థిక మంత్రి 45 శాతం అని పేర్కొనడంపై విచారణ చేయాల్సిన బాధ్యత లేదా అని బోస్‌ ప్రశ్నించారు. నీటి పారుదల రంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా నీటిని తోడుకునేందుకు ప్రాజెక్టులను తెలంగాణ సీఎం నిర్మిస్తుంటే చంద్రబాబు సర్కారు పెదవి విప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులæ వల్ల పోలవరానికి కలిగే నష్టాలు తద్వారా కృష్ణా,గోదావరి డెల్టాలు ఎడారిగా మారనున్నాయని విమర్శించారు. ధవళేశ్వరం నుంచి గోదావరిని కృష్ణా నదికి బ్రిటిష్‌ కాలంలోనే అనుసంధానం చేశారన్నారు. దేశంలో 8చోట్ల 20 నదులకు పైగా అనుసంధానం 100 ఏళ్ల క్రితమే జరిగిందనే సంగతిని ఇరిగేషన్‌ మంత్రి మర్చిపోయి గొప్పలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడేళ్లు ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.4.691 కోట్లను, బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో రూ.1,836 కోట్లను ఖర్చు చేయలేదన్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97, 123 కోట్లు రాష్ట్రానికి అప్పులు ఉంటే అవి 2018 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు పెరుగుతాయని చెప్పడం దారుణమన్నారు. సర్కారు విధానాల ఫలితంగా అన్ని రంగాలు దెబ్బతింటుంటే ఇంక వృద్ధి రేటు ఎలా సాధ్యమవుతుందని, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని బోస్‌ డిమాండ్‌ చేశారు.
మరిన్ని వార్తలు