అభివృద్ధి మోదీది.. ప్రచారం బాబుది

17 May, 2016 09:54 IST|Sakshi
అభివృద్ధి మోదీది.. ప్రచారం బాబుది

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపాటు

అనకాపల్లి/సింహాచలం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.వందల కోట్ల ప్యాకేజీ, పరిశ్రమలను కేటాయిస్తుంటే రాష్ట్ర సర్కారు  కేవలం రాజధాని గురించే మాట్లాడుతోందని, దాన్నే ప్రచారం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. ఆయన సోమవారం విశాఖ జిల్లా అనకాపల్లిలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు విడిపోయిన 11 రాష్ట్రాలు రాజధానులను నిర్మించుకున్నాయని, కానీ ఇక్కడే రాజధానిని నిర్మిస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో రాజధాని నిర్మాణానికి రూ.లక్షల కోట్లు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

ప్రత్యేక హోదా కంటే రూ.వేల కోట్ల నిధులతో ఏపీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని పని చేస్తున్నారని వివరించారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా మోదీ బొమ్మ కనిపించడం లేదని ఆక్షేపించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకోవడమే ఇక్కడి సీఎం ఘనత అని  వ్యాఖ్యానించారు. అమరావతిని హెరిటేజ్ నగరంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సెంట్‌మెంట్లను ఆపి అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికారు.

 హోదా కాదు.. ప్రత్యేక రాష్ట్రమే: ప్రత్యేక హోదా ఇవ్వడం కంటే కేంద్రం ఏపీనిప్రత్యేక రాష్ట్రంగానే గుర్తిస్తోందని సోము వీర్రాజు తెలిపారు. ఆయన సోమవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు