‘మోడల్‌’ ఉపాధ్యాయుల డుమ్మా

20 Jul, 2016 01:20 IST|Sakshi
  • ప్రిన్సిపాల్‌తో సహా 8 మంది విధులకు గైర్హాజరు
  • ఈనెల 16 నుంచి బడికి రాని పంతుళ్లు
  • ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈవో ఆకస్మిక తనిఖీ
  • గీసుకొండ : మండలంలోని వంచనగిరి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మాధవితో పాటు, మరో ఏడుగురు ఉపాధ్యాయులు ఈ నెల 16 నుంచి ఎలాంటి అనుమతి లేకుండా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న వైనం బయటపడింది. రాష్రీ్టయ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) డిప్యూటీ ఈవో తోట రవీందర్‌ మంగళవారం ఉదయం 11.30 గంటలకు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో డుమ్మా వ్యవహారం వెలుగుచూపింది. ప్రిన్సిపాల్‌తో పాటు సీహెచ్‌. స్వప్న, జి.మనోహర్, కె.స్రవంతి, పి. దయాకర్‌రెడ్డి, ఎండీ. షరీఫ్, వై.శ్రీకాంత్‌ లీవులో ఉన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు డిప్యూటీ ఈవో తన తనిఖీలో గుర్తించారు. పాఠశాలలో మొత్తం 18 మంది టీచర్లు ఉండగా వారిలో 8 మంది మూడు రోజులుగా విధులకు రావడం లేదు. రిజిస్టర్‌లో లీవు పెట్టినట్లు, హాజరు వేసుకున్నట్లు లేకుండా టీచర్ల పేర్ల ఎదురుగా ఆయా తేదీల్లో ఖాళీగా ఉందని గమనించారు. వీరితో పాటు ఎ.లావణ్యరెడ్డి పేరుతో హాజరు రిజిస్టర్‌లో రెండు పూటలా సంతకం చేసి ఉంది. ఆమె విధుల్లో లేకపోడంతో గమనించిన ఆయన విస్తుపోయారు. ప్రిన్సిపాల్‌గా విధులకు డుమ్మా కొట్టడమే కాకుండా ఇన్‌చార్జిగా బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. అలాగే పాఠశాలలోని మ«ధ్యాహ్న భోజనం, అడ్మిషన్‌ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించిన డిప్యూటీ ఈవో అవికూడా సరిగా లేవని గుర్తించారు. ‘ఇది పాఠశాలా..గొడ్ల కొట్టమా, అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, టీచర్ల డుమ్మా వ్యవహారంపై ఆర్‌ఎంఎస్‌ఏ జాయింట్‌ డైరెక్టర్‌తో పాటు జిల్లాలోని విద్యాశాఖ ఉన్నతాధికారులకు క్రమశిక్షణ  చర్య నిమిత్తం నివేదిక సమర్పిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈవో సుజన్‌తేజ, సీఆర్‌పీ టి.వెంకటేశ్వర్లు ఉన్నారు.   
మరిన్ని వార్తలు