మో‘డల్‌’ స్కూళ్లు

18 Sep, 2016 22:18 IST|Sakshi
మో‘డల్‌’ స్కూళ్లు

– బాలారిష్టాల్లో వసతి గహాల ఏర్పాటు
– ఏళ్లుగా సాగుతున్న నిర్మాణాలు
– ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీ పోస్టులు ఖాళీలతో విద్యార్థుల ఇక్కట్లు
– 172 టీచర్‌ పోస్టులు ఖాళీ
– వివిధ తరగతుల్లో 3,532 సీట్లు ఖాళీ


అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇది గార్లదిన్నెలోని మోడల్‌ స్కూల్‌లోని తరగతి గది నిర్మాణం. 2013లో అప్పటి రాష్ట్ర ప్రాథమికశాఖ మంత్రి శైలజానాథ్‌ ఈ స్కూల్‌ను ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి దాకా నిర్మాణం  జరుగుతూనే ఉంది. బాల, బాలికలకు మరుగుదొడ్లు,  రెండో   తరగతి గదుల నిర్మాణం పూర్తి కాలేదు. జిల్లాలోని అన్ని మోడల్‌ స్కూళ్ల పరిస్థితి ఇలానే ఉంది. 2012–13 విద్యా సంవత్సరంలో ప్రతి మండలంలోనూ ఓ మోడల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2013–14లో తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. ఇవి కూడా పూర్తిగా నిర్మాణాలకు నోచుకోలేదు.  

సౌకర్యాలు కరువు..
హాస్టల్‌ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తులు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి రెసిడెన్షియల్‌ విషయంలో చేతులెత్తేశారు. ఆ తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. అది కూడా అమలు కాలేదు. తాజాగా ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థినులకు హాస్టల్‌ వసతి కల్పిస్తామని చెప్పిన అధికారులు భవన నిర్మాణాలు పూర్తి కాలేదని చేతులెత్తేశారు.

తగ్గుతోన్న విద్యార్థుల సంఖ్య
ఆంగ్లమాధ్యమంతో పాటు రెసిడెన్షియల్‌ వసతి కల్పిస్తామని ప్రకటించడంతో   స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎగబడ్డారు.  ఎమ్మెల్యే, మంత్రులు, చివరకు కేంద్రమంత్రులు కూడా సీటు కోసం సిఫార్సులు చేశారు. ఏడాదికేడాది స్కూళ్లకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత కారణంగా తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా  25æ స్కూళ్లలో విద్యార్థుల సీట్లు 3,532 ఖాళీగా ఉన్నాయి.  ప్రిన్సిపాళ్ల పోస్టులు 19, పీజీటీ 96, టీజీటీ   57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
–––––––––––––––––––––––––   
అక్టోబర్‌  పూర్తవుతాయి
నిర్మాణాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమే. ఈ నెల 1 నుంచి విద్యార్థినులకు వసతిగహాలు ప్రారంభించాల్సి ఉన్నా చాలాచోట్ల నిర్మాణాలు జరగక పెండింగ్‌ పడింది. అక్టోబర్‌ నాటికి వసతి గహాలు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది.   పూర్తిస్థాయిలో హాస్టల్‌ వసతి కల్పిస్తే ఈ స్కూళ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది.
 – శ్రీరాములు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మోడల్‌ స్కూల్స్‌ 

మరిన్ని వార్తలు