మోడల్ స్కూల్ టీచర్ల 30 గంటల దీక్ష

16 Sep, 2016 18:37 IST|Sakshi

మోడల్ స్కూల్ టీచర్లపట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీఎంఎస్‌టీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బోసుబాబు విమర్శించారు. మోడల్ స్కూల్ టీచర్లకు పీఆర్‌సీ ఇవ్వాలని, సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, సీపీఎస్ రద్దు చేయాలంటూ ధర్నాచౌక్‌లో 30 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షాశిబిరాన్ని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ప్రారంభించారు. అంతకుముందు మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు మహా ర్యాలీ చేపట్టారు.

 

ధర్నాచౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభలో బోసుబాబు మాట్లాడుతూ మోడల్‌స్కూల్ టీచర్లకు 2015 జనవరి డీఏ నేటికీ చెల్లించలేదన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే మెడికల్ రీయింబర్స్‌మెంట్, హెల్త్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కూడా వర్తింపజేయడం లేదన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషితోనే మోడల్ స్కూల్స్ 96శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 155 మోడల్ స్కూల్స్ ప్రస్తుతం 1900 మంది పనిచేస్తున్నారని, ఇంకా 200పైగా పోస్టులు భర్తీచేయాల్సి ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను మండలిలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి మోడల్‌స్కూల్ టీచర్ల దీక్షకు మద్దతు తెలిపారు. పీఆర్‌సీ అమలు చేస్తూ ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీమోహన్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, హైమావతి, వెంకట్రామయ్య, కార్యదర్శులు రాముడు, సోమయ్య, నరేంద్రనాయక్, హారిక, కార్యవర్గ సభ్యులు సాగర్‌కుమార్, సురేష్, ప్రేమ్‌భూషన్, సుబ్బారావు దీక్షలో పాల్గొన్నారు. ర్యాలీలో 13జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు