మాచ్‌ఖండ్‌కు వెలుగులు

21 Aug, 2016 20:15 IST|Sakshi
మాచ్‌ఖండ్‌కు వెలుగులు
  •  6 దశాబ్దాల తర్వాత ఆధునికీకరణకు ఆమోదం
  •  పెరగనున్న విద్యుత్‌ ఉత్పత్తి
  • సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు వెలుగులీననుంది. ప్రాజెక్టును ఆధునీకరణ చేపట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా సిద్ధం అవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారిగా సహజ నీటి వనరుల ఆధారంగా రెండు రాష్ట్రాల ఖర్చుతో మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాకులు దూరని కారడవిలో విదేశీ పరిజ్ఞానంతో దీనిని నెలకొల్పారు. మొదటి రాష్ట్రపతి బాబూరాజంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం అయింది. అయితే కొన్నాళ్లు తర్వాత ఈ  ప్రాజెక్టును ఇరు రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తికి చీకట్లు అలముకున్నాయి. తరచూ కేంద్రం మరమ్మతులకు గురువుతూ వచ్చింది. అయినా  పెద్దగా దృష్టి పెట్టింది లేదు. అయితే ఇప్పుడు ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. మరో 30 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. 
    దశల వారీగా పనులు
    మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు 15 మెగావాట్లు, మిగిలినవి 27 మెగావాట్లు చొప్పున ఉత్పత్తి చేస్తాయి. ఈ యూనిట్ల వయోపరిమితి 40 ఏళ్లు కాగా.. 20 ఏళ్లు పైబడి వినియోగించారు. దీంతో ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల అంగీకారంతో ఈ యూనిట్లకు కొత్త పరికరాలు అమర్చనున్నారు. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం ఇక్కడ 120 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఆధునికీకరణ చేపడితే ఒక్కో యూనిట్‌కు 3 నుంచి 4 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతుందని జెన్‌కో ఇంజనీర్లు చెబుతున్నారు. పెరిగే విద్యుత్‌ ఉత్పత్తిని ఒడిశాకు పంపించినా మన వాటా విద్యుత్‌ను పెందుర్తి ఫీడర్‌కు సరఫరా అవుతుందని అంటున్నారు. 
     
    విద్యుత్‌ కొరత తీరుతుంది
    ఆధునికీకరణకు నోచుకోక తరచూ ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగిన మాచ్‌ఖండ్‌కు ఆధునికీకరణ అనుమతులు సిద్ధం అవడం ఆనందంగా ఉంది. ఇదే జరిగితే 15 మెగావాట్లకు పైబడి ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో విద్యుత్‌ కొరత తీరుతుంది.                                                                                                                  – ఎన్‌.మురళీమోహన్,  సీలేరు ఎస్‌ఈ
     
మరిన్ని వార్తలు