మోదీ..కరుణించేనా..?

7 Aug, 2016 00:00 IST|Sakshi
మోదీ..కరుణించేనా..?

సంగారెడ్డి రోడ్డు విస్తరణకు నిధులు రాబట్టేందుకు సర్కార్‌ యత్నం
నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నివేదించునున్న ప్రభుత్వం
భువనగిరి
 చిట్యాల– సంగారెడ్డి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆదివారం మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా చిట్యాల– సంగారెడ్డి రోడ్డు విస్తరణకు నిధులు ఇవ్వాలని విన్నవించనున్నారు. దీంతోపాటు నల్లగొండ, మెదక్‌ జిల్లాల వాహనాలతో పాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు వెళ్తున్న చిట్యాల– భువనగిరి–గజ్వేల్‌–సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించాలని ప్రధానిని కోరనున్నారు.
ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు..
మూడు జాతీయ, మూడు రాష్ట్ర రహదారులను కలుపుతూ అంతర్‌జిల్లా వ్వాపార వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా ఉన్న భువనగిరి–గజ్వేల్‌– తూప్రాన్‌–సంగారెడ్డి లింక్‌ రోడ్డును నాలుగులేన్లుగా మార్చాలనే ప్రతిపాదనలు ఐదేళ్ల క్రితమే చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ రహదారిని చేపట్టాలని సంకల్పించి, పలుమార్లు ట్రాఫిక్‌ సర్వే చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఉమ్మడి ఏపీలో మంజూరు కాని ఈ రోడ్డు స్వరాష్ట్రంలో మంజూరు చేయించుకోవడానికి అధికారులు నివేదికను రూపొందించారు.
మూడుసార్లు ప్రకటనలు..
జిల్లాలోని చిట్యాల నుంచి గజ్వేల్‌ మీదుగా సంగారెడ్డి వరకు 170 కి.మీల పొడవున ఉన్న ఈ లింక్‌ రోడ్డు 163, 44, 65 మూడు జాతీయ రహదారులతో పాటు రాజీవ్‌ రహదారి హైదరాబాద్‌–మెదక్, సంగారెడ్డి రూట్లలో మరో మూడు రాష్ట్ర ర హదారులను కలుపుతుండటం వల్ల వ్వాపార, వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా మారింది. దక్షిణ, ఉత్తర భారతదేశాల మధ్యన నడిచే వ్యాపార, వాణిజ్య వాహనాలకు ఈ రోడ్డు ద్వారా చాలా దూరాభారం తగ్గుతుంది. దీంతో పాటు రాజధాని హైదరాబాద్‌పై వాహనాల భారం పడకుండా నేరుగా సమయం అదా అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్డును పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌) కింద నాలుగు లేన్లుగా మార్చడానికి ఇప్పటివరకు మూడుసార్లు ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే పలుమార్లు ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ సర్వే కూడా పూర్తి చేశారు. కానీ కార్యాచరణకు అమలుకు నోచుకోలేదు. ప్రధాని పర్యటనలోనైనా రోడ్డు విస్తరణకు మోక్షం లభించే అవకాశం కోసం జిల్లా వాసులతో పాటు అధికారులు ఎదురు చూస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు