బుజ్జిగారు చెప్పారు.. తలా వందివ్వండి

4 Nov, 2015 11:07 IST|Sakshi
బుజ్జిగారు చెప్పారు.. తలా వందివ్వండి

ఏలూరు: రాజధాని అమరావతి శంకుస్థాపనకు వందల కోట్ల రూపాయలు దుబారా చేసిన పాలకులు ఇప్పుడు ఆ నిర్మాణం పేరిట వృద్ధులు, వికలాంగులు, వితంతు పింఛన్లలో కోత విధిస్తున్నారు. ప్రతి ఒక్కరి పింఛన్ సొమ్ము నుంచి వందరూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. లేదంటే పింఛన్ డబ్బు ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏలూరు నగరపాలకసంస్థలో లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ రూ. వంద స్వచ్ఛందంగా ఇవ్వాలంటూ చేస్తున్న బలవంతపు వసూళ్లకు ఎమ్మెల్యే బుజ్జి పూర్తి సహకారం అందిస్తున్నారు. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ రూ. 100 ఇచ్చే విధంగా ప్రకటన జారీ చేయాలని పౌరసంబంధాల అధికారులను కోరారు. అందుకు అనుగుణంగా అధికారులు ఒక్కో లబ్ధిదారుడు రూ. 100 ఇవ్వాలంటూ మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు.
 
విద్యార్థుల నుంచి రూ. 10
పింఛన్‌దారుల నుంచే కాకుండా నగరంలోని ప్రభుత్వ, కార్పొరేషన్ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పది రూపాయలు చొప్పున ఇవ్వాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
 
కార్పొరేటర్ ఇళ్లు, కార్యాలయాల వద్ద పంపిణీ
ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 18,890 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. ప్రతి నెలా మాదిరిగానే ఈసారీ పింఛన్లు తీసుకునేందుకు రెండురోజులుగా లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు వెళుతున్నారు. అయితే ఎక్కడికక్కడ పింఛన్ కేంద్రాల వద్ద కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు కాపుకాసి పింఛన్ సొమ్ము తీసుకోగానే అందులో నుంచి రూ. వంద వసూలు చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో కార్పొరేటర్లు తమ అనుచరులను పెట్టి వసూళ్లు చేయిస్తున్నారు. మరికొన్ని డివిజన్లలో పింఛన్ల పంపిణీని కార్పొరేటర్ ఇళ్లు, వారి కార్యాలయాల ఏర్పాటు చేశారు. పింఛన్లు తీసుకునేందుకు వచ్చేవారు తప్పకుండా రూ. 100 తీసుకుని రావాలని ముందుగానే ఆదేశాలు జారీ చేస్తున్నారు. రూ. 100 వసూలు చేసిన తర్వాతే పింఛను ఇచ్చే కౌంటరులోకి పంపిస్తున్నారు. అధికార పార్టీ నేతల దందాకు కార్పొరేషన్ అధికారులు పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతున్నారు. దాదాపు రూ. 20 లక్షల వసూలుకు తెరలేపారు.
 
 ఎమ్మెల్యే ఇమ్మన్నారని తీసుకున్నారు

 ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ సరిగ్గా ఇంటి అద్దెకి సరిపోతుంది. ఈ నెల రూ. 100 తగ్గించి ఇచ్చారు. దీనివల్ల తిరిగి రూ. 100 అప్పు చేసి ఇంటి అద్దె కట్టాలి. ఎమ్మెల్యే రూ. 100 రాజధాని నిర్మాణానికి ఇవ్వమన్నారని చెప్పి తీసుకున్నారు.
 - మద్దె లక్ష్మమ్మ, ఏలూరు, 10వ డివిజన్
 
 రూ. 100 తీసుకురమ్మన్నారు
 రాజధానికి విరాళం కింద రూ. 100 తప్పకుండా తీసుకురావాలని చెప్పారు. రానున్న నెలల్లో పింఛన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు పెడతారేమోనని ఇచ్చాం. రూ. వందతో నాకు 10 రోజులకు మందులు వస్తాయి.    
 - యల్లపు చిట్టెమ్మ. ఏలూరు, 9వ డివిజన్
 

మరిన్ని వార్తలు